తెలంగాణ

telangana

ఇండియా కూటమికి మరో షాక్​- చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 5:07 PM IST

Updated : Jan 30, 2024, 6:13 PM IST

Chandigarh Mayoral Polls : చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌-కాంగ్రెస్‌కు గట్టి షాక్​ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ముందు తొలి పరీక్షగా భావించిన చండీగఢ్‌ మేయర్‌ పోరులో ఈ కూటమి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ మేయర్‌గా గెలుపొందారు. అయితే ఈ ఎన్నిక అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా జరిగిందని ఆప్​ ఆరోపిస్తోంది. దీనిపై బీజేపీ ఎదురుదాడికి దిగింది.

Chandigarh Mayoral Polls Won By BJP
Chandigarh Mayoral Polls Won By BJP

Chandigarh Mayoral Polls : చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసిన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి కులదీప్‌ కుమార్‌పై మనోజ్‌ గెలుపొందారు. కాగా, పంజాబ్‌, హరియాణా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మేయర్‌ ఎన్నిక జరిగింది. భారీ భద్రత నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో మేయర్‌ పీఠం బీజేపీని వరించింది. మరోవైపు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థి మనోజ్​ సోంకర్​ గెలుపొందడం వల్ల సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, ఆప్​ కౌన్సిలర్లు బీజేపీ మోసపూరితంగా మేయర్​ పదవిని దక్కించుకుందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిదని ఆరోపించారు.

ఓటు వేసేందుకు కూటమి కౌన్సిలర్లు నో!
ఇక పోలైన 36 ఓట్లలో మనోజ్‌ సోంకర్‌కు 16 ఓట్లు దక్కాయి. చండీగఢ్‌ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ ఎక్స్-అఫీషియో మెంబర్‌గా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థికి 12 ఓట్లు లభించగా, 8 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పొత్తులో భాగంగా మేయర్‌ పదవి కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ, సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల కోసం కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టాయి. ఐతే సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీల కౌన్సిలర్లు నిరాకరించారు. దీంతో బీజేపీ అభ్యర్థి రాజేందర్‌ కుమార్‌ డిప్యూటీ మేయర్‌గా గెలుపొందారు. కాగా, చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు.

'వచ్చే ఎన్నికల్లో వాళ్లు ఎంతకైనా తెగిస్తారు'
చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా విజయం సాధించిందని ఆప్‌ ఆరోపించింది. మేయర్‌ ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శించారు. ఇది ఆందోళన చెందాల్సిన అంశమన్నారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చూశాక సార్వత్రిక ఎన్నికల్లో వారు ఎంతవరకైనా వెళ్లేందుకు వెనకాడరని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేజ్రీవాల్‌ అనుమానం వ్యక్తంచేశారు.

"76 ఏళ్ల క్రితం ఈరోజు మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. సరిగ్గా అదే రోజు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసింది. వారి(బీజేపీ) నిజాయితీ, గూండాయిజం దృశ్యాల్లో కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యావత్​ దేశం దీనిని చూస్తోంది. నేడు ప్రజాస్వామ్యానికి బ్లాక్​డే. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీలే టార్గెట్​గా కమలం నేతలు దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలు నిజాయితీగా జరిగి ఉంటే ఈరోజు ఇండియా కూటమి తన మొదటి విజయాన్ని నమోదు చేసేది. ఈ ఎన్నికల్లో 25% ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఇవి ఎలాంటి ఎన్నికలో నాకు అర్థం కావడంలేదు. గెలుపు కోసం బీజేపీ ఎలాంటి అక్రమాలకైనా పాల్పడుతుందనడనికి ఇది ఒక నిదర్శనం."
- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ప్రజాస్వామ్యం దోపిడీకి గురైంది : పంజాబ్​ సీఎం
చండీగఢ్ మేయర్ ఎన్నిక తీరుపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మండిపడ్డారు. ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యం దోపిడీకి గురైందని అన్నారు. 'బీజేపీ పక్షాన ఉన్న 16 మందికి ఓటు ఎలా వేయాలో తెలుసు, మా వైపు ఉన్న 8 మందికి ఓటు ఎలా వేయాలో కూడా తెలియదు!. బీజేపీ మైనార్టీ విభాగం నేత అనిల్​ మసీహ్​ను ప్రిసైడింగ్‌ అధికారిగా పెట్టారు. వెన్నెముక సమస్యతో ఎన్నికకు హాజరుకాలేనని 18న ప్రిసైడింగ్‌ అధికారి చెప్పారు. ఈ సమస్య నిజమే అనేలా ప్రిసైడింగ్‌ అధికారి వ్యవహరించారు. కానీ, అది అబద్ధం అని ఈరోజు నాకు తెలిసింది. ప్రిసైడింగ్‌ అధికారికి నిజంగా వెన్నెముక సమస్యే ఉంటే అతడు ఓట్లను సరిగా లెక్కించేవారు' అని భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు.

'ఇది ప్రజాస్వామ్యానికి ఓటమి'
చండీగఢ్ మేయర్ ఎన్నికపై ఆప్​ ఎంపీ రాఘవ్‌ చద్దా స్పందించారు. తమకు(ఆప్‌, కాంగ్రెస్‌ కూటమికి) 20 స్థానాలు ఉన్నాయన్న ఆయన బీజేపీకి కేవలం 16 స్థానాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. 'మా 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. బీజేపీ ఓట్లు మాత్రం అన్నీ చెల్లుబాటుగా పరిగణించారు. మేయర్ ఎన్నికలో 8 ఓట్లు చెల్లనివిగా ప్రకటించటం ఇదే తొలిసారి. ఇది ప్రజాస్వామ్యానికి ఓటమి. తాజా పరిణామంతో బీజేపీ ఏ విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందో స్పష్టంగా అర్థమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కమలం నాయకులు ఇంకెన్ని అక్రమాలకు పాల్పడతారో అని భయంగా ఉంది' అని రాఘవ్‌ చద్దా వ్యాఖ్యానించారు. మరోవైపు చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను కాంగ్రెస్‌ నేతలు అసంబద్ధమైనదిగా పేర్కొన్నారు.

మేయర్​ స్పందన!
ఆప్‌ ఆరోపణలను బీజేపీ తరఫున మేయర్‌గా ఎన్నికైన మనోజ్‌ సోంకర్‌ తోసిపుచ్చారు. తమకు అనుకూల పరిస్థితులు లేకుంటే ఆరోపణలు చేయటం ఆప్‌నకు అలవాటేనన్నారు. ప్రతిదీ కెమెరాలో రికార్డ్‌ అయిందన్న బీజేపీ మేయర్‌ మనోజ్‌ సోంకర్‌ ఓటమిని జీర్ణించుకోలేకే ఆప్‌ నేతలు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

కోర్టు మెట్లెక్కిన మేయర్​ ఎన్నిక!
చండీగఢ్ మేయర్ ఎన్నికల ప్రక్రియ కోర్టు మెట్లెక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై పంజాబ్​, హరియాణా హైకోర్టులో రిట్​ పిటిషన్​ను దాఖలు చేసినట్లు కాంగ్రెస్​, ఆప్​ తరఫు న్యాయవాది ఫెర్రీ సోఫాట్​ చెప్పారు. ఈ వ్యాజ్యంలో పూర్తి ఎన్నికల ప్రక్రియను సవాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 'ఎన్నిక నిర్వహణ తీరుపై విచారించేందుకు కోర్టు అనుమతించింది. జనవరి 31న బుధవారం దీనిపై వాదనలు వింటామని చెప్పింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను మేము కోర్టుకు సమర్పించాము' అని ఫెర్రీ సోఫాట్ వ్యాఖ్యానించారు.

ఇద్దరు టీచర్లను కాల్చిచంపిన ఉపాధ్యాయుడు! స్కూల్​కు గన్​ తీసుకువచ్చి హత్య

బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ! విపక్షాలకు కేంద్రం సలహా- కీలక ప్రకటనలు ఉంటాయా?

Last Updated : Jan 30, 2024, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details