తెలంగాణ

telangana

ఏపీలో ఉధృతంగా అంగన్వాడీల ఆందోళన- అర్ధరాత్రి అరెస్టులతో అలజడి

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 7:16 AM IST

Anganwadis Arrest in AP హామీల సాధనకోసం అలుపెరగక పోరాడుతున్న అంగన్వాడీల ఆందోళనలపై పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. అర్ధరాత్రి నుంచి అంగన్వాడీల దీక్షా శిబిరాలను ఖాళీ చేయించే క్రమంలో పోలీసులు అరెస్టుల పర్వం సాగిస్తున్నారు. కోటి సంతకాల ప్రతులను సీఎంకు సమర్పించేందుకు, చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.

anganwadis_arrest_in_ap
anganwadis_arrest_in_ap

Anganwadis Arrest in AP: ఆంధ్రప్రదేశ్​లో అంగన్వాడీలు ఆందోళనలను మరింత తీవ్రతరం అయ్యాయి. హామీల సాధన కోసం 41 రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపిస్తూ 'జగనన్నకు చెబుదాం' పేరుతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ, ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, విజయవాడ చేరుకుని తీరుతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు అంగన్వాడీలు సిద్ధమయ్యారు. శాంతియుత నిరసనలతో సమస్యలు పరిష్కారం కావడం లేదని, హామీలిచ్చిన ముఖ్యమంత్రికే తమ గోడు వినిపించేందుకు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జగనన్నకు చెబుదాం పేరిట పెద్దఎత్తున విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. సమ్మెలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను నేరుగా సీఎంకు అందజేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై అంగన్వాడీలు మండిపడ్డారు.

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం - స్పష్టం చేసిన అంగన్వాడీలు

దీక్షా శిబిరంలో ముందస్తు అరెస్టు : వైఎస్సార్​ జిల్లా మైదుకూరు నుంచి విజయవాడకు కారులో తరలివెళ్తున్న కార్యకర్తలను బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మైదుకూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. కర్నూలులో దీక్షా శిబిరంలోని కార్యకర్తలను ఖాకీలు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంగన్వాడీలు స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సొంత పూచికత్తుపై విడుదల : అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడ వస్తున్న అంగన్వాడీలను పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంతపూచికత్తుపై ఆ తర్వాత విడుదల చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పోలీసుస్టేషన్ ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు.

డిమాండ్ల సాధన కోసం విశ్రమించని అంగన్వాడీలు - మొద్దు నిద్రను నటిస్తున్న ప్రభుత్వం

విషమంగా ఆరోగ్యం : విజయనగరం జిల్లా కురుపాం మండలానికి చెందిన కార్యకర్తలను విజయనగరం రైల్వేస్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్యకర్తలు ప్లాట్​ఫామ్‌పైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆమరణ నిరాహారదీక్షకు దిగిన కార్యకర్తల్లో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

బస్సులను పోలీస్​ స్టేషన్​కు: నెల్లూరు జిల్లాలోని కావలిలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. రెండు ప్రైవేట్‌ బస్సుల్లో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ వర్కర్లను, కావలి టోల్​ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు విజయవాడకు తరలివెళ్లకుండా, బస్సులను కావలి గ్రామీణ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ప్రాణాలు పోయినా సమ్మె ఆపం - నిరవధిక నిరాహార దీక్షలో అంగన్వాడీలు

ABOUT THE AUTHOR

...view details