మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే : కిషన్ రెడ్డి
Kishan Reddy Assembly Election Campaign in Amberpet : గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలో తెలపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ తరపున ప్రేమ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు పోవాలన్నా, ధ్వంసం అయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్న మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని కిషన్ రెడ్డి అన్నారు.
అంబర్‌పేటలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతిపక్ష కార్యకర్తలు, ప్రజలపై అనేక రకమైన వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 21 స్కూళ్లు కట్టించామని.. ఇవే కాకుండా ఒక బీసీ హాస్టల్ ఐదు సబ్ స్టేషన్లు, 100 నూతన కమ్యూనిటి హాల్స్ కట్టించడం జరిగిందన్నారు. అంబర్ పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గడిచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలపాల్సిన అవసరం ఉందని విమర్శించారు.