Fire Accident At Hyderabad : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు
Published: May 17, 2023, 9:47 AM

Fire Accident At Hyderabad : హైదరాబాద్‌లోని టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొగల్ ఖానా వద్ద ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలో ఎక్కువగా ప్లాస్టిక్ సమాగ్రి ఉండటంతో.. మంటలు శరవేగంగా అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు పెరిగిపోయాయి. గమమించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్ హౌస్ ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనంతో పాటు దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఎంతమేర ఆస్తినష్టం జరిగిందో ఇంకా తెలియరాలేదు. ఈ మధ్యకాలంలో నగరంలో చోటుచేసుకుంటున్నా వరుస అగ్నిప్రమాదాలు భాగ్యనగర వాసులను మరింత భయందోళనకు గురి చేస్తున్నాయి. ఎక్కువగా స్క్రాప్ షాప్‌లలో అగ్నిప్రమాదాలు జరగడంతో వాటిని జనావాసాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నారు.