MLC Jeevan Reddy Fires on KCR : 'దశాబ్ది కాలంలో.. శతాబ్ది అభివృద్ధి అనేది ఎన్నికల స్టంటే..'
Published: May 19, 2023, 4:18 PM

MLC Jeevan Reddy Fires on KCR : రాష్ట్రంలో దశాబ్ది కాలంలో.. శతాబ్ది అభివృద్ధి అనేది ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏ కార్యక్రమమైనా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.
రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని.. కేసీఆర్ చేసే అభివృద్ధి ప్రకటనలకే పరిమితం అయింది తప్ప.. ఆచరణలో శూన్యం అని విమర్శించారు. మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు, నిధుల ఖర్చు, దళిత బంధు, రూ.5 లక్షలతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, బీసీల అభ్యున్నతి వంటి అంశాల ప్రస్తావనే రాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ మాటలకు కాలం చెల్లింది కాబట్టే.. తాజాగా మహారాష్ట్రపై పడ్డారని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలన్నారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.