హారతి పళ్లెంలో డబ్బులు - మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కేసు నమోదు
Case Filed on Minister Satyavathi Rathod : మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెట్టారంటూ ఎఫ్ఎస్టీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గూడూరు మండలం కొంగరగిద్దలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌కు మద్దతుగా సత్యవతి రాఠోడ్ ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు మేళ తాళాలతో ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు సత్యవతి రాఠోడ్‌కు మంగళహారతి ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి హారతి పళ్లెంలో నాలుగు వేల రూపాయలు వేశారు.
ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. ఈ విషయాన్ని గమనించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంత్రి రూ.4వేలు మహిళలకు ఇచ్చారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఎస్టీ సభ్యుడు మురళీ మోహన్ ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేశారు. దీనిపై మంత్రి సత్యవతి రాఠోడ్ ఇప్పటి వరకు స్పందించలేదు.