ETV Bharat / t20-world-cup-2022

పెద్ద జట్లకు పసికూనల షాక్​లు.. వరుణుడి ఆటలు.. లెక్కలు మారుతున్నాయ్​!

author img

By

Published : Oct 29, 2022, 7:16 AM IST

t20 world cup
టీ20 ప్రపంచకప్

T20 World Cup : అసమాన పోరాటంతో ఓ వైపు అగ్రశ్రేణి జట్లకు పసికూనలు షాకులిస్తున్నాయి. మరోవైపు వరుణుడు జట్లతో ఆటాడుకుంటున్నాడు. ఇటు సంచలనాలు.. అటు వాన జోరు కలిసి టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ రేసును ఉత్కంఠభరితంగా మార్చేశాయి. పెద్ద జట్ల గమనంపై ప్రభావం చూపుతున్న ఈ పరిణామాలతో సమీకరణాలు మారిపోతున్నాయి. సెమీస్‌ చేరే జట్లను కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. మునుపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారిన పొట్టి కప్పు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో?

T20 World Cup : టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో ఇప్పటికే ఒక్కో జట్టు కనీసం రెండు మ్యాచ్‌లాడింది. హోరాహోరీ పోరాటాలు.. చివరి బంతి విజయాలతో క్రికెట్‌ ప్రేమికులను మునివేళ్లపై నిలబెడుతున్న ఈ పొట్టి కప్పు పోరు రసవత్తరంగా మారింది. అనూహ్య ఫలితాలు వస్తుండడం, వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవుతుండడంతో టోర్నీ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ వర్షం అంతరాయం లేకపోతే ఇప్పటివరకూ జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లో ఇదే అత్యుత్తమ టోర్నీగా నిలిచేదనడంలో సందేహం లేదు. హోరాహోరీ మ్యాచ్‌లు, పెద్ద జట్లపై పసికూనల విజయాలే అందుకు కారణం. క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత్‌, పాకిస్థాన్‌ పోరు సాగిన తీరు టోర్నీకే ఊపును తెచ్చింది. ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌, పాకిస్థాన్‌పై జింబాబ్వే సంచలన విజయాలు కప్పును మరింత ఆసక్తికరంగా మార్చేశాయి.

కూనలే అనుకుంటే..: సూపర్‌-12లో గ్రూప్‌-1లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. గ్రూప్‌-2లో భారత్‌, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ తలపడుతున్నాయి. వీటిల్లో ఐర్లాండ్‌, అఫ్గానిస్థాన్‌, జింబాబ్వే, నెదర్లాండ్స్‌ను మినహాయిస్తే సెమీస్‌ రేసులో మిగతా 8 జట్ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ టోర్నీ సాగుతున్నా కొద్దీ చిన్న జట్లు సత్తాచాటుతున్నాయి. పేరుకే పసికూనలు కానీ ఆటలో పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తూ అద్భుత విజయాలు అందుకుంటున్నాయి. పెద్ద జట్ల భవితవ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఐర్లాండ్‌, జింబాబ్వే గురించి చెప్పుకోవాలి. రెండు సార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను దెబ్బకొట్టి సూపర్‌-12కు అర్హత సాధించిన ఐర్లాండ్‌.. అసలు సమరంలో ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. మరోవైపు తొలిసారి పొట్టి కప్పు రెండో రౌండ్లో ఆడుతున్న జింబాబ్వే.. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వేదికపై అగ్రశ్రేణి జట్లతో తలపడడమే గొప్ప అవకాశంగా భావించే ఈ చిన్న జట్లు మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. తమలోని నైపుణ్యాలను చాటాలనే కసి, పెద్ద జట్లపై గెలవగలమని నిరూపించాలనే పట్టుదలతో అదరగొడుతున్నాయి. బ్యాటింగ్‌లో తడబడుతున్నప్పటికీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం అత్యున్నత ప్రమాణాలను ప్రదర్శిస్తున్నాయి. మైదానంలో చురుగ్గా కదులుతున్న ఆటగాళ్లు ఎలాగైనా సరే బంతిని ఆపాలనే ధ్యేయంతో సాగుతున్నారు. ఇక తీవ్ర ఒత్తిడిలోనూ బౌలర్లు క్రమశిక్షణతో బంతులేస్తూ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బలమైన బ్యాటింగ్‌ విభాగం ఉన్న ఇంగ్లాండ్‌ పరుగులు కోసం చెమటోడ్చేలా ఐర్లాండ్‌ బౌలర్లు కట్టడి చేసిన తీరు, చివరి ఓవర్లో 11 పరుగులు చేయకుండా పాకిస్థాన్‌ను జింబాబ్వే బౌలర్లు అడ్డుకున్న విధానం అమోఘం. ఇక టీ20 క్రికెట్లో తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేసే అఫ్గానిస్థాన్‌కు ఇప్పటివరకూ సరైన అవకాశం రాలేదు.

సెమీస్‌ చేరే జట్లేవో?: చిన్న జట్ల దెబ్బకు, వరుణుడి ప్రతాపానికి సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్‌-2 కంటే కూడా గ్రూప్‌-1లో ఏ జట్లు ముందంజ వేస్తాయన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. గ్రూప్‌-2లో అన్ని జట్లూ తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. రెండు విజయాలతో టీమ్‌ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఒక్కో గెలుపు, రద్దుతో కలిపి దక్షిణాఫ్రికా, జింబాబ్వే వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌ (ఓ గెలుపు, ఓటమి) నాలుగులో ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటములతో పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌పై నెగ్గిన భారత్‌ సులువుగానే సెమీస్‌ చేరే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చెరో మూడు పాయింట్లతో ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌తో సఫారీ సేన ఆడాల్సి ఉంది. వీటిల్లో గెలిస్తేనే ఆ జట్టుకు అవకాశాలుంటాయి. లేదంటే భారత్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌తో తలపడాల్సిన జింబాబ్వే ఆ జట్టుకు ఎసరు పెట్టే ప్రమాదం ఉంది. భారత్‌తో ఓడినప్పటికీ బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌పై నెగ్గితే జింబాబ్వే కూడా సెమీస్‌ రేసులో ఉంటుంది. ఇంకా బోణీ కొట్టని పాక్‌ పరిస్థితే ఇబ్బందికరంగా మారింది. ఆ జట్టు భవితవ్యం భారత్‌పై ఆధారపడి ఉంది. ఆ జట్టు సెమీస్‌ చేరాలంటే.. ముందుగా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాలి. భారత్‌ కూడా అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలి. నెదర్లాండ్స్‌ లేదా బంగ్లాదేశ్‌ చేతిలో జింబాబ్వే ఓడాలి. గ్రూప్‌-1లో కివీస్‌, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా తలో మూడు పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ నెట్‌ రన్‌రేట్‌ పరంగా వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. కివీస్‌ (ఓ విజయం, రద్దు) మినహా మిగతా మూడు జట్లు మూడేసి మ్యాచ్‌లాడి ఒక్కో గెలుపు, ఓటమి, రద్దు ఖాతాలో వేసుకున్నాయి. శ్రీలంక (ఓ గెలుపు, ఓటమి), అఫ్గానిస్థాన్‌ (ఓటమి, రెండు రద్దు) వరుసగా చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన కివీస్‌ మెరుగైన స్థితిలో ఉంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఐర్లాండ్‌ చేతిలో ఓటమి ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. తాజాగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షార్పణం అవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ (న్యూజిలాండ్‌, శ్రీలంకతో), ఆస్ట్రేలియా (ఐర్లాండ్‌, అఫ్గానిస్థాన్‌తో) తప్పనిసరిగా గెలవాల్సిందే. అప్పుడు కూడా మిగతా జట్ల ఫలితాలపై, నెట్‌ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అంతే కాకుండా న్యూజిలాండ్‌ మిగతా మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. లేకపోతే అప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో ఒక్క జట్టుకే సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది.

వరుణుడు ఆడేస్తున్నాడు..
ప్రపంచకప్‌లో ప్రస్తుతం టైటిల్‌ కోసం 13 జట్లు పోటీపడుతున్నాయి! అదేంటీ సూపర్‌-12లో ఉన్నవి 12 జట్లే కదా అనుకుంటున్నారా? ఆ పదమూడో జట్టు పేరు వర్షం. అవును.. టోర్నీలో ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నది వరుణుడే. ఇప్పటికే మిగతా జట్ల కంటే ఎక్కువగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. అంటే తన ప్రతాపంతో నాలుగు మ్యాచ్‌లు జరగకుండా చేశాడు. మరో మ్యాచ్‌లో ఫలితంపై ప్రభావం చూపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వసంత కాలం నడుస్తోంది. అకాల వర్షాల కారణంగా మ్యాచ్‌లకు అంతరాయం కలుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి అక్టోబర్‌లో ఎక్కువ వర్షపాతం నమోదవుతోందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో అయితే వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వాన దెబ్బకు ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. గ్రూప్‌-1లో అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పోరు ఆ జాబితాలో చేరాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో చివర్లో వర్షం రావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐర్లాండ్‌ గెలిచింది. ఇక గ్రూప్‌-2లో భాగంగా హోబర్ట్‌లో జింబాబ్వేపై గెలిచేలా కనిపించిన దక్షిణాఫ్రికా.. వాన రాకతో పాయింట్లు పంచుకోక తప్పలేదు. అంతకుముందు భారత్‌, పాక్‌ మ్యాచ్‌కూ వాన గండం ఉందనిపించింది. కానీ మ్యాచ్‌ సమయానికి వాతావరణం అనుకూలంగా మారింది. మెల్‌బోర్న్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అందులో ఒకటి భారత్‌, జింబాబ్వే పోరు కాగా.. మరొకటి నవంబర్‌ 13న ఫైనల్‌. తుదిపోరుకు రిజర్వ్‌డే ఉంది. కానీ వచ్చే నెల 6న జింబాబ్వేతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ వరకూ వాతావరణం ఎలా మారుతుందో చూడాలి.

పాయింట్ల పట్టిక

ఇవీ చదవండి: T20 worldcup: పాక్​ జట్టుపై బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

T20 worldcup: సికిందర్​ రాజా స్పిన్ మ్యాజిక్​ వెనక ఉన్నది ఇతడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.