ETV Bharat / sukhibhava

గుండె లయ తప్పుతోంది.. బతుకు గాడి తప్పుతోంది

author img

By

Published : Jun 7, 2022, 10:41 AM IST

Heart Diseases
Heart Diseases

Heart Diseases : జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగ సమస్యలతో గుండె లయ తప్పుతోంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన హృదయం కొన్నిసార్లు మొరాయిస్తోంది.. మరికొన్ని సార్లు అతివేగంగా కొట్టుకుంటోంది. 25-30 శాతం హృద్రోగ మరణాలు గుండె లయ దెబ్బతినడం వల్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానురాను గుండె సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఏటా జూన్ 6 నుంచి 12 వరకు ప్రపంచ గుండె లయ వారాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలో హృదయ సంబంధిత సమస్యలున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

Heart Diseases : గుండె లయ తప్పుతోంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె అంతకంటే వేగంగా స్పందిస్తోంది. లేదంటే కొన్నిసార్లు మొరాయిస్తోంది. జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, ఇతరత్రా హృద్రోగ సమస్యలు ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం గుండె సమస్యలతో వచ్చే రోగుల్లో 5-7 శాతం లయ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారంటున్నారు. 25-30 శాతం హృద్రోగ మరణాలు గుండె లయ దెబ్బతినటం(అరిథ్మియా)కు సంబంధించినవేనని స్పష్టం చేస్తున్నారు. ఏటా జూన్‌ 6 నుంచి 12 వరకు ప్రపంచ గుండె లయ వారాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వారంపాటు ఉస్మానియాలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గుండె/లయ సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఇక్కడ పరీక్షలు, ఉచిత చికిత్సలు చేయించుకోవచ్చు.

HeartBeat Week in Osmania : అరిథ్మియా సమస్య ప్రజల్ని ఎప్పటి నుంచో వేధిస్తోంది. అయితే ఇటీవల బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, పొగతాగడం, మద్యపానం, ఇతరత్రా గుండె సమస్యల కారణంగా హృదయ కణజాలంలో అసాధారణ మార్పులు చోటుచేసుకొని అరిథ్మియా తలెత్తుతోంది. ఆరోగ్యవంతుల గుండె నిమిషానికి 72-84 సార్లు కొట్టుకుంటుంది. భావోద్వేగ, ఆందోళనకర పరిస్థితుల్లో కొన్నిసార్లు 60-100 వరకు లయ ఉంటుంది. దీనినీ సాధారణంగానే భావిస్తారు. అరిథ్మియా సమస్య ఉన్నవారిలో గుండె లయ 60 కంటే తక్కువ లేదా 100 కంటే ఎక్కువగా ఉంటుంది. తరచూ ఇదే సమస్య వేధిస్తుంటే గుండెలయలో ఇబ్బంది ఉన్నట్లేనని గుర్తించాలి. సత్వరం వైద్యులను సంప్రదించాలి.

ప్రధాన కారణాలు... కరోనా తర్వాత చాలామందిలో గుండె కణజాలంలో వచ్చిన మార్పులు అరిథ్మియాకు కారణమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేవలం కరోనాయే కాక గుండెకు రక్త సరఫరా తగ్గడం, గుండె కణజాలం బిరుసుగా మారటం, గుండె గదులు వెడల్పు కావడం, ఒత్తిడి, భావోద్వేగాలు, ఆందోళన, గుండెకు జరిగే రక్త సరఫరాలో సోడియం, పొటాషియం లాంటి ఎలెక్ట్రోలైట్స్‌, హార్మోన్ల అసమతుల్యత.. హృదయ స్పందనపై ప్రభావం చూపుతాయి. కొన్ని రకాల ఔషధాలూ గుండె లయను దెబ్బతీస్తాయి. రక్త సంబంధీకుల్లో అరిథ్మియా బాధితులుంటే.. తర్వాత తరాన్నీ ఆ సమస్య వెంటాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలి ఆకస్మిక గుండె వైఫల్యాలకు అధిక శాతం గుండె లయ హెచ్చుతగ్గులే కారణమని అంటున్నారు.

  • ఇవీ లక్షణాలు.. ఒక్కసారిగా శ్వాస ఆడకపోవడం
  • మైకం, ఛాతీనొప్పి, మూర్ఛ
  • తల పట్టేసినట్లు అనిపించడం
  • ఆకస్మిక బలహీనత, ఛాతీలో దడ
  • చెమటలు పట్టడం, గందరగోళం
  • రెండు, మూడు మెట్లు ఎక్కేసరికే అలసిపోవటం
డాక్టర్‌ కె.ఎం.కె.రెడ్డి

జీవనశైలి మార్పులతోనే సమస్య అంతా.. 'గతంతో పోల్చితే కరోనా తర్వాత గుండె లయ సమస్యలతో వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి మార్పులూ ఇందుకు మూలమవుతున్నాయి. గుండె తరచూ వేగంగా కొట్టుకుంటున్నా.. తగ్గినా అప్రమత్తం కావాలి. లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయరాదు. గుండె లయ వారోత్సవాల్లో భాగంగా ఉస్మానియాలో ఉచితంగా పరీక్షలు చేయనున్నాం. రక్త పరీక్షలు, ఎలెక్ట్రోలైట్స్‌, లిపిడ్లు, హార్మోన్ల స్థాయులు అంచనా వేయడం, ఈసీజీ, 2 డీఎకో, ఎలెక్ట్రో కార్డియోగ్రామ్‌ ద్వారా హృదయ స్పందన, రేటు అంచనా వేస్తాం. ప్రైవేటులో రూ.7-8 వేలు అయ్యే పరీక్షలన్నీ ఉచితంగా చేస్తాం. మంగళవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి.' -- డాక్టర్‌ కె.ఎం.కె.రెడ్డి, సీనియర్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.