ETV Bharat / sukhibhava

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ముప్పే!

author img

By

Published : Nov 4, 2020, 10:31 AM IST

sukhibhava
నిద్ర

నిద్ర.. తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ప్రమాదమే. తక్కువసేపు నిద్రపోయినవారి మాదిరిగానే 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయినవారికీ గుండెజబ్బు ముప్పు 35% పెరుగుతున్నట్టు తేలింది. అతిగా నిద్రపోయేవారికి పక్షవాతం, మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు మరికొన్ని అధ్యయనాలు కూడా ఘోషిస్తున్నాయి. మరి మనకు ఎంత నిద్ర అవసరం? ఎప్పుడు ఎక్కువ? ఎప్పుడు తక్కువ? తెలుసుకుందాం రండి..

నిద్ర తక్కువైతే ఊబకాయం, గుండెజబ్బు, కుంగుబాటు.. చివరికి అకాల మరణం వంటి ముప్పులు పెరుగుతాయి. అయితే అతిగా నిద్రపోయినా ఇలాంటి ముప్పులు పొంచి ఉంటున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తైవాన్‌కు చెందిన 4 లక్షల మంది నిద్ర తీరుతెన్నులపై ఏడేళ్ల పాటు పరిశోధకులు అధ్యయనం చేశారు. రాత్రిపూట 6-8 గంటల సేపు నిద్రపోయే వారితో పోలిస్తే 4 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి గుండెజబ్బు ముప్పు 34% ఎక్కువగా ఉంటున్నట్టు గమనించారు.

తక్కువసేపు నిద్రపోయినవారి మాదిరిగానే 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయినవారికీ గుండెజబ్బు ముప్పు 35% పెరుగుతున్నట్టు తేలింది. అతిగా నిద్రపోయేవారికి పక్షవాతం, మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు మరికొన్ని అధ్యయనాలు కూడా ఘోషిస్తున్నాయి. "ఆ.. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగి ఉంటాయి లెండి.. వాళ్లంతా ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్లే ఎక్కువసేపు నిద్రపోయి ఉండొచ్చు" అని పెదవి విరుస్తున్నారేమో. ఇదీ గమనించాల్సిన విషయమే.

డీఎన్​ఏలోనూ మార్పు..

కాకపోతే అతి నిద్ర మూలంగా డీఎన్‌ఏ సైతం మారిపోతున్నట్టు 2014లో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంటోంది. జన్యుపరంగా కుంగుబాటు వచ్చే అవకాశం గలవారి నిద్ర తీరుతెన్నులను ఇందులో పరిశీలించారు. రాత్రిపూట 7-9 గంటల సేపు నిద్రపోయేవారిలో 27% మందికి కుంగుబాటు లక్షణాలు పొడసూపగా.. 7 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారిలో సుమారు 50% మందిలో కుంగుబాటు లక్షణాలు కనబడటం గమనార్హం. అంటే తగినంత నిద్రలేకపోయినా, అతిగా నిద్రపోయినా డీఎన్‌ఏ మారటానికి దారితీస్తోందన్నమాట.

మరి మనకు ఎంత నిద్ర అవసరం? ఎప్పుడు ఎక్కువ? ఎప్పుడు తక్కువ? అనేగా మీ సందేహం. ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వయసు చాలా కీలకం. సాధారణంగా పెద్దవాళ్లు రాత్రిపూట 7-9 గంటల సేపు నిద్రపోవటం మంచిదన్నది నిపుణుల సూచన. కొందరికి 6 లేదా 10 గంటల నిద్ర కూడా అవసరపడొచ్చు. ఏదేమైనా ఉదయం పూట లేచాక తలనొప్పి, వెన్నునొప్పి, మగత వంటి ఇబ్బందులేవీ లేకుండా హాయిగా, హుషారుగా ఉన్నామనే భావన కలిగితే కంటి నిండా నిద్రపోయినట్టే అనుకోవచ్చు. ఒకవేళ తగినంతసేపు నిద్రపోవటం లేదని అనిపిస్తుంటే రోజూ ఒకే సమయానికి నిద్రపోవటం, ఒకే సమయానికి లేవటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. దీంతో అటు తక్కువ కాకుండా.. ఇటు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యాన్ని 'కంటి నిండా' కాపాడుకోవచ్చు.

ఇదీ చూడండి: కరోనా వైరస్​తో గుండెకు మరింత ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.