ETV Bharat / international

కరోనా వైరస్​తో గుండెకు మరింత ముప్పు!

author img

By

Published : Nov 1, 2020, 7:07 PM IST

శ్వాసకోశ వ్యవస్థపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ మహమ్మారి​ నేరుగా హృదయ కండరాలకు సోకుతుందని, గుండె దెబ్బతినడానికి దారితీసే ఇతర సమస్యలనూ కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్​ గుండెను ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం.

coronavirus affect the heart
కరోనా వైరస్​తో గుండెకు ముప్పు!

కరోనా బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారిలోనూ ఇతర సమస్యలు తలెత్తుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ మహమ్మారిని శ్వాసకోశ ప్రభావిత వైరస్​గా చెప్పుకుంటున్నప్పటికీ.. నేరుగా గుండె కండరాలకు సోకుతుందని, గుండె దెబ్బతినడానికి దారితీసే ఇతర సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల పనితీరుపై కొవిడ్​-19 తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల గుండెకు సరిపడా ఆక్సిజన్​ అందదు. అంతేకాదు గుండె లోపల కణాల్లో ప్రతి చర్యలు జరిగి మంటపుడుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశముంటుంది. ఈ వైరస్​ రక్త నాళాలపైనా దాడి చేస్తుంది. ఫలితంగా నాళాల్లో రక్తం గడ్డకట్టి గుండెనొప్పికి దారితీసే ప్రమాదం ఉంది. చాలా మంది కొవిడ్​-19 రోగుల్లో శరీరం మొత్తం రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు వైద్యులు. అయితే.. దీనిపై వైద్యుల్లో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ కొందరు వైద్యులు రక్తం గడ్డకట్టకుండా ఉంచే చికిత్సలు కూడా చేపట్టారు.

"గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా​ వైరస్​తో ప్రమాదం అధికం. ఎలాంటి వ్యాధులు లేని కరోనా రోగుల్లోనూ గుండె సంబంధిత సమస్యలను గుర్తించాం."

- డాక్టర్​ సీన్​ పిన్నేయ్​, చికాగో విశ్వవిద్యాలయం

అమెరికా కార్డియాలజీ కళాశాల జర్నల్​లో ఇటీవల ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల్లో 25 శాతం గుండె సంబంధిత సమస్యలు తెలెత్తినట్లు తేలింది. కొన్ని కేంద్రాల్లో అది 30 శాతం నుంచి ఆపైన నమోదైనట్లు తెలిసింది. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న రోగుల్లోనూ.. ఎంజైమ్​ స్థాయిలు తగ్గటం సహా ఇతర సమస్యలతో గుండె దెబ్బతినే సంకేతాలను కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే.. ఈ సమస్య తాత్కాలికమా, శాశ్వతమా అనేది తేల్చలేదు.

కొంత మంది న్యుమోనియాతో మరణించిన కొవిడ్​-19 రోగుల్లోని గుండెలో.. కరోనా వైరస్​ను గుర్తించినట్లు ఓ పరిశోధనలో బహిర్గతమైంది. మరో అధ్యయనంలో.. కరోనా నుంచి కోలుకున్న నలుగురు అథ్లెట్ల​లో గుండె కండరాల సమస్య తలెత్తినట్లు తేలింది. అయితే పూర్తి స్పష్టత కోసం ఇంకా పరిశోధన అవసరమని అమెరికా కార్డియాలజీ కళాశాల బోర్డు సభ్యుడు డాక్టర్​ టామ్​ మాడాక్స్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్‌ ప్రభావం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.