ETV Bharat / sukhibhava

చిన్న మార్పులతోనే మేలైన ఆరోగ్యం!

author img

By

Published : Dec 20, 2020, 1:00 PM IST

SMALL CHANGES IS GIVES GOOD HEALTH
మేలైన ఆరోగ్యం కోసం.. చిన్న మార్పైనా చాలు!

మంచి ఆరోగ్యం కోసం ఎల్లవేళలా భారీ మార్పులే చేసుకోనక్కర్లేదు. ఒక్కసారిగా మన అలవాట్లను మార్చుకోకపోయినా.. క్రమంగా వాటిలో మార్పులు చేసుకుంటే సరి. అలా చిన్న మార్పులతోనే మేలైన ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే తెలుసుకోండి.

ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులే చేసుకోవాలనేమీ లేదు. చిన్నవైనా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి చిన్న చిన్న మార్పలను గురించి ఓ సారి పరిశీలిస్తే...

భోజనంతో పాటు ఓ పండు

రోజుకు ఐదు సార్లు పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. దీన్ని గుర్తుంచుకోవటం కష్టమనుకుంటే భోజనం, టిఫిన్‌ చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక పండు తినటం అలవాటు చేసుకోండి. దీంతో కనీసం మూడు సార్లైనా పండ్లు తిన్నట్టవుతుంది. పండ్లలోని పీచు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాల వంటివి గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గేలా చేస్తాయి.

సంచి బరువు కాస్త తగ్గినా..

వీపులకు, భుజాలకు తగిలించుకునే సంచులను ఎప్పటికప్పుడు తరచి చూసుకోండి. అవసరం లేనివాటిని వెంటనే తీసేయండి. ఇలాంటి వాటి బరువు మన శరీర బరువులో 10శాతం కన్నా మించకుండా చూసుకోవటం మంచిది. ఇలా మెడ, వెన్ను, భుజం నొప్పుల బారినపడకుండా కాపాడుకోవచ్చు.

చక్కెర చిటికెడు తగ్గించి..

చక్కెరతో జీవక్రియలు, మెదడు పనితీరు మందగిస్తాయి. దీన్ని ఒకింత తగ్గించి పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలను మరింత పెంచుకోవటం మంచిది. ఎందుకంటే చక్కెర, శుద్ధిచేసిన ధాన్యాలతో చేసిన ఉత్పత్తులను తగ్గించటం సహా.. మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయోటిక్‌ పదార్థాలను తీసుకుంటే ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతున్నాయన్నది నిపుణుల సూచన.

ప్రయాణాల్లో ఒకింత విరామం

ఎక్కువసేపు ప్రయాణాలు చేస్తుంటే మధ్య మధ్యలో విరామం తీసుకోవటం, అటూ ఇటూ నాలుగైదు అడుగులు వేయటం ఎంతైనా అవసరం. దీంతో కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఒక కాలును వెనక్కి జరిపి, రెండో కాలును చిన్నపాటి ఎత్తు మీద పెట్టి, శరీరాన్ని ముందుకు సాగదీసే ప్రయత్నం చేసినా మంచిదే. కూర్చున్నప్పుడు కదలకుండా ఉండిపోయిన తొడ, వీపు కండరాలు సాగటానికిది తోడ్పడుతుంది.

ఇదీ చదవండి: రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.