ETV Bharat / sukhibhava

ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందండిలా!

author img

By

Published : Apr 4, 2021, 1:51 PM IST

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నట్లు మన శరీరంలో కళ్లకు ఎంతో ప్రాధాన్యముంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది తమ కంటి సంరక్షణను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమందికి కళ్ల కింద నల్లటి వలయాల్లాంటి మచ్చలు ఉంటే, మరికొంతమందికి కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. సరైన నిద్రలేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడడం, పదే పదే కాఫీ-టీలు తాగడం, ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురికావడం, పోషకాహార లోపం...ఇవన్నీ కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉబ్బిన కళ్లు అమ్మాయిలను అందవిహీనంగా మార్చేస్తున్నాయి. మరి, ఇలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలేంటో తెలుసుకుందామా?!

easy remedies to get of puffy eyes
ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందండిలా!

అలా ఉంటే సమస్యే!
సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కళ్లు మళ్లీ మామూలుగా అయిపోతాయి. అయితే నీటితో శుభ్రపరచుకున్న తర్వాత కూడా కళ్లు ఉబ్బినట్లుగానే ఉంటే ఏదో సమస్య ఉందని అర్థం అని చెబుతున్నారు నిపుణులు. ఈక్రమంలో కొన్ని సహజ చిట్కాలు పాటించడం ద్వారా ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

ఇలా బయటపడండి!

  • శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయట! అందుకే నీళ్లు ఎక్కువగా తాగమంటున్నారు నిపుణులు.
  • నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • టీ, కాఫీ, కార్బొనేటెడ్‌ ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్‌... తదితర పానీయాలను తరచుగా తీసుకోవడం వల్ల కళ్లు ఉబ్బిపోయి అందవిహీనంగా తయారవుతాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది.
  • కొత్తిమీరను డైట్‌లో చేర్చుకోవడం వల్ల వేగంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఎందుకంటే కొత్తిమీర మూత్ర పిండాల ద్వారా వ్యర్థ పదార్థాలు, మలినాలను వడపోసి బయటకు పంపించేస్తుంది. సలాడ్లు, సూప్స్‌లలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఈక్రమంలో దోసకాయ, కొత్తిమీర, టొమాటో... తదితర పదార్థాలతో తయారుచేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఉబ్బిన కళ్ల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ జ్యూస్‌ తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


కావాల్సిన పదార్థాలు

  • దోసకాయ-1
  • వాము ఆకులు-2
  • టొమాటో-1
  • కొత్తిమీర- కొంచెం
  • నిమ్మరసం- టీస్పూన్‌

తయారీ
పైన పేర్కొన్న కూరగాయలన్నింటినీ ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం మిక్సీలో వేసి జ్యూస్‌ లాగా తయారుచేసుకోవాలి. దీనికి నిమ్మరసాన్ని కలిపి వెంటనే తాగాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే ఉబ్బిన కళ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.

ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారుగా... మరి మీకూ ఈ సమస్య ఎదురైతే ఈ చిట్కాలను పాటించండి. అయితే ఇలా చేసినా కూడా సమస్య తగ్గకపోగా.. దురద, మంట, ఎరుపెక్కడం.. లాంటి సమస్యలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇదీ చదవండి: వెదురు పళ్లెంలో తినేద్దామా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.