ETV Bharat / sukhibhava

ఫలరాజు 'మామిడి' ప్రయోజనాలు తెలుసా?.. ఊబకాయానికి చెక్ పెట్టొచ్చట​!

author img

By

Published : May 13, 2023, 7:04 AM IST

Mango Health Benefits : ఫలాలన్నింటిలో రారాజు మామిడిపండు. రుచిలో ఈ పండు అమృతంతో సమానం. మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మనదేశపు జాతీయఫలం మామిడి. భారతదేశంలో వంద రకాలకు పైగా మామిడి పళ్లు దొరుకుతాయి. అలాంటి మామిడి పళ్లలో ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

mango health benefits
mango health benefits

Mango Health Benefits : మామిడిపండ్లు ఎక్కువ శాతం తియ్యగానే ఉన్నా కొన్ని జాతుల పండ్లు కొంచెం పుల్లగా వుంటాయి. కొన్ని పండ్లు పీచుతో, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి. వీటని మలోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడికాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి వుంటాయి. ఈ రుచి ఎందరో మహామహుల్ని కట్టిపడేసింది. మామిడి పండ్లలో ఇన్ని రకాలున్నా భౌగోళిక విశిష్టతని పొందిన బంగినపల్లి రుచి మరే మామిడి పండుకూ రాదు. తోతాపురి, సఫేదా, ఆల్ఫోన్సో చౌసా వంటి మామిడి పండ్లకు కూడా గిరాకీ ఎక్కువే.

మామిడికాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్లు కూడా పెడతారు. పచ్చిముక్కలను ఎండబెట్టి మామిడి ఒరుగుగా సంవత్సరం అంతా వాడే అలవాటు కూడా వుంది. ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడి చేసి ఆమ్చూర్ పొడి అంటే మామిడి పొడిగా అమ్ముతుంటారు. దీనిని వంటలో విరివిగా వాడతారు. పచ్చి మామిడికాయను పప్పులోనూ, రోటి పచ్చడిగానూ, ఇంకా వివిధ రూపాల్లో వంటల్లో వాడుతుంటారు. పచ్చి మామిడికాయను సన్నని పొడవైన ముక్కలుగా కోసి ఉప్పు, కారం చల్లి తింటే అదో అద్భుతమైన రుచి!

పండిన మామిడికాయల నుంచి తీసిన మామిడి రసాన్ని సీసాలు, ప్యాక్ రూపంలో వ్యాపార సంస్థలు దేశం అంతా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ లాంటి పండ్ల రసాలు అంగడిలో అమ్ముతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మామిడి పండ్ల గుజ్జు నుంచి మామిడి తాండ్రను చేసి విక్రయిస్తుంటారు. ముక్కలు కోసి మిక్సీలో వేసుకుని స్మూతీగానూ మామిడి రుచులను ఆస్వాదించవచ్చు. మామిడి కుల్ఫీ, మామిడి ఐస్​క్రీమ్​ను కూడా మామిడి గుజ్జు నుంచి తయారుచేస్తారు. మామిడి జామ్ ఇష్టపడని పిల్లలుంటారా చెప్పండి. పచ్చి మామిడికాయ నుంచి తీసిన ఆమ్​ పన్నా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.

మామిడిని ఒక అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది 20 కంటే ఎక్కువ విభిన్న విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంది. మామిడిపండ్లను తినటం వల్ల శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మామిడిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. మామిడి పండ్లలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వేసవిలో వేడిమి కారణంగా సహజంగా కలిగే అలసట, డీహైడ్రేషన్ సమస్యల్ని తగ్గిస్తాయి.

మామిడితో ప్రయోజనాలు:

  • జీర్ణ సంబంధిత సమస్యలను మామిడి పండ్లు దూరం చేస్తాయి.
  • మామిడి పండులో ఉండే ఖనిజాలు గుండె జబ్బులు, ఊబకాయం రాకుండా కాపాడతాయి.
  • చర్మ సౌందర్యం పెరగాలంటే మామిడిని మించిన పండు లేదు.
  • రోగనిరోధకశక్తిని పెంచే బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.
  • అధికరక్తపోటును తగ్గిస్తుంది మామిడిపండు.
  • సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యాన్నిస్తుంది.
  • రక్తహీనత సమస్యకు మామిడిపండు మంచి ఔషధం.
  • ఈ పండులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది.
  • శరీరానికి హాని చేసే కొవ్వును తగ్గిస్తుంది.

మధుమేహ చికిత్సలో మామిడి ఆకులు చాలా ఉపయోగపడతాయి. పండగ రోజుల్లో, శుభకార్యాలలో తలుపులకు మామిడాకు తోరణాలు కట్టటం ఒక సంప్రదాయం. మామిడి విత్తనాల నుంచి చమురు తయారుచేస్తారు. మామిడిపండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉండటం వలన ఇన్సులిన్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు మామిడిపండ్లకు దూరంగా ఉండటం ఉత్తమం. అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినాల్సిందే. మామిడిపండు ఒక సంతృప్తికరమైన తీపి విందు. అందుకే ఈ పోషకభరితమైన మామిడిపండ్లను మన ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి మామిడిపండే! మామిడిపండ్లను తినండి - మజా చేయండి - సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.