ETV Bharat / sukhibhava

పండ్లు, కూరగాయలే కొత్త క్యాన్సర్‌ ఔషధాలు!

author img

By

Published : Aug 3, 2021, 10:22 AM IST

Cancer
Cancer

కొన్ని కూరగాయలు, పండ్లలోని పదార్థాలు ప్రత్యేకించి కొన్నిరకాల క్యాన్సర్లపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్‌ ఔషధాలకు పండ్లు, కూరగాయల్లోని ఎంజైమ్‌లే ఆధారం కానున్నట్లు తెలిపారు.

ఆహారమే ఔషధం. అనాదిగా మనం నమ్ముతున్న సూత్రం ఇదే. ప్రస్తుతం పరిశోధకులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. కొత్త క్యాన్సర్‌ ఔషధాలకు పండ్లు, కూరగాయల్లోని రసాయన మిశ్రమాలు, ఎంజైమ్‌లే ఆధారాలు కానున్నాయి! ఇవి కణితులు ఏర్పడటాన్ని నివారించటానికి, క్యాన్సర్‌గా మారటాన్ని ఆపటానికి, క్యాన్సర్‌ కణాల విభజన ప్రక్రియను అణచివేయటానికి తోడ్పడుతున్న తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. పండ్లు, కూరగాయల్లోని 30 రకాల రసాయన మిశ్రమాలతో రకరకాల ప్రయోగాలు చేసి దీన్ని కనుగొన్నారు.

ఆహార పదార్థాల్లోని రసాయనాలు కణాల ప్రొటీన్లపై ఎలా పనిచేస్తాయన్నది గుర్తించటం కీలకం. కణితుల మీదే దాడిచేసే కొత్త మందులను సృష్టించటానికిది అత్యవసరం. అందుకే ఇవి ప్రొటీన్లకు అంటుకుంటున్న తీరుపై, ప్రధానంగా క్యాన్సర్‌ కణితులు వృద్ధి కావటంలో కీలకపాత్ర పోషించే ఫాస్ఫాటిడైలినోసిటాల్‌-3-కైనేజ్‌ అనే ఎంజైమ్‌ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా తొమ్మిది రకాల రసాయనాలు, ఎంజైమ్‌లు దీన్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్టు గుర్తించారు.

ఇవన్నీ బ్రకోలీ, క్యాబేజీ, పాలకూర, గోబీపువ్వు, క్యారెట్, దోసకాయ, టమోటా వంటి కూరగాయల్లో ఉంటుండటం విశేషం. కొన్ని కూరగాయలు, పండ్లలోని పదార్థాలు ప్రత్యేకించి కొన్నిరకాల క్యాన్సర్లపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి కూడా. ఉదాహరణకు- ద్రాక్షపండ్ల పైపొరలో దండిగా ఉండే రిజర్విటాల్‌, బ్లూబెర్రీల్లోని టెరోస్టిల్‌బెన్‌ రొమ్ముక్యాన్సర్‌లో మూలకణాల వ్యాప్తిని అదుపు చేస్తున్నాయి. ఇక క్యాబేజీలోని ఇండోల్‌-3-కార్బినోల్‌ అయితే రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, ఎండోమెట్రియం క్యాన్సర్ల వంటి పలు రకాల క్యాన్సర్లను అడ్డుకుంటోంది.

ఇదీ చూడండి: వ్యాయామం చేస్తున్నారా?.. ఇవి తినడం మరవకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.