Bandi Sanjay on CM KCR: దేశంలో షెడ్యూల్‌ లేని సీఎం కేసీఆర్‌ మాత్రమే: బండి సంజయ్

author img

By

Published : Aug 3, 2022, 6:04 AM IST

Bandi Sanjay

Bandi Sanjay on CM KCR: రాష్ట్రంలో రాక్షసపాలన జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సభలో విమర్శించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సభలో ఆయన మాట్లాడారు. అవినీతిపరులను జైల్లో వేసేందుకు భాజపాకు అధికారమివ్వాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పిలుపునిచ్చారు. కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆయన ఆరోపించారు.

Bandi Sanjay on CM KCR: రాష్ట్రంలో రాక్షసపాలన జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సభలో విమర్శించారు. బుక్కెడు బువ్వ కోసం బాసర ట్రిపుల్‌ ఐటీతో పాటు రాష్ట్రంలోని పలు గురుకులాల విద్యార్థులు అలమటిస్తున్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి నిజాయితీ ఉంటే అక్కడికి వెళ్లి భోజనం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రణాళిక లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ ముఖం పెట్టుకొని జాతీయహోదా ఇవ్వాలంటున్నారని మండిపడ్డారు. చీకోటి ప్రవీణ్‌ క్యాసినో ఉదంతంలోనూ తెరవెనుక ఉన్నది తెరాస నేతలే అని ఆరోపించారు.

‘భాజపా ఎక్కడుందన్న వాళ్లకు పాలమూరులో చూపించాం. ఇప్పుడు నల్గొండలో.. తర్వాత ఖమ్మంలోనూ చూపిస్తాం. దేశంలో షెడ్యూల్‌ లేని సీఎం కేసీఆర్‌ మాత్రమే. దిల్లీకి ఎందుకు పోయారో ఆయనకే తెలియదు. ఇక్కడ ఏమీ చేయని కేసీఆర్‌ దిల్లీలో రాజకీయ సమీకరణాలను మారుస్తానంటున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, రూ. వేల కోట్లు ఎక్కడున్నాయో కేసీఆర్‌ చెప్పాలి. లేదంటే భాజపా ప్రభుత్వం వచ్చాక లెక్కలు తేలుస్తాం. కేసీఆర్‌ చేతగాని పాలన వల్ల ఏడాదిలో సుమారు 2 వేల మంది చేనేత కార్మికులు మరణించారు. మరణించిన నేత కార్మికులకూ బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్‌ నాణ్యత లేని పనులు చేయించారు’ అని బండి సంజయ్‌ విమర్శించారు.

కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం: కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి పాలిచ్చే గేదెలాగా.. ఈ ప్రాజెక్టు డబ్బు సంపాదించే మిషన్‌ అయిందని విమర్శించారు. ఇంజినీరింగ్‌, డిజైన్‌ లోపం కారణంగానే ఇటీవలి వరదల్లో కాళేశ్వరం పంపుహౌస్‌లు మునిగాయన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రిలో మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాదాద్రి శివారు యాదగిరిపల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తెచ్చి గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తాం. ఎవరు సీఎం అయినా తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తారు.

- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజాసంగ్రామ యాత్ర

‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్‌ అడుగుతుంటే మోదీ ఎందుకివ్వడం లేదని మీడియా వాళ్లు నన్ను అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు ఆనకట్టలు, పంప్‌హౌస్‌లు నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రాజెక్టును తప్పుడు డిజైన్‌తో నిర్మించారు. ఇంజినీరింగ్‌ లోపముంది. సరైన ప్లానింగ్‌ లేకపోవడం వల్లే ప్రాజెక్టు ముంపునకు గురైంది. పైగా దీనికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ లేదు. పర్యావరణ అనుమతులు లేవు. ఇన్ని లోపాలున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా సాధ్యం? కేసీఆర్‌ అక్రమాల ప్రాజెక్టుకు మోదీని బాధ్యుడిని చేయడానికి జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. అది ఇస్తే కేంద్రం బదనాం అయ్యేది. జరిగిన తప్పులకు కేసీఆర్‌ బాధ్యత వహించాల్సిందే’’ అని షెకావత్‌ అన్నారు. అవినీతిపరులను జైళ్లో వేసేందుకు భాజపాకు ఈ దఫా అధికారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిస్థాయిలో అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారికి సరైన నివాళి ఇవ్వాలి అంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన అభ్యర్థికి కాకుండా అవినీతి, కుటుంబ పార్టీలకు మద్దతిచ్చారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు లోక్‌సభలో అప్పటి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఆమెను చిన్నమ్మగా గుర్తుపెట్టుకున్నారన్నారు. ఎంతో పవిత్రస్థలమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

సభలో కార్యకర్తలు

యాదాద్రిలో నాసిరకం పనులు: డీకే అరుణ

‘రూ.వందల కోట్లతో నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణ పనులన్నీ నాసిరకంగా జరిగాయి. ఇందులో అన్ని అవకతవకలే చోటు చేసుకున్నాయి. కాసులకు, కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు చేశారు. రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమే’ నని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ అన్నారు.

అద్దాల మేడలో కేసీఆర్‌: ఈటల

‘2014కి ముందు కులం, మతం అనే సంబంధం లేకుండా కొట్లాడినం. ఇప్పుడు భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాటం చేయాలి. కేసీఆర్‌ అద్దాల మేడలో ఉన్నారు. ఒక్క రాయి వేస్తే అది పగిలిపోతుంది. కేసీఆర్‌ను మట్టికరిపించే అవకాశం హుజూరాబాద్‌ ప్రజలకు దక్కింది. ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోంది. కాంగ్రెస్‌ అంతరించిపోతున్న పార్టీ’ అని భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

భారీ కాన్వాయ్‌తో బండి రాక

హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, ఖైరతాబాద్‌ ఏడుగుళ్ల సముదాయం ఆవరణలో పూజలు చేసిన అనంతరం మంగళవారం ఉదయం ర్యాలీగా హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన బండి సంజయ్‌ 12.30 గంటల ప్రాంతంలో యాదాద్రికి చేరుకున్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కలవని బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి

మంగళవారం ఉదయమే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి యాదాద్రికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రెసిడెన్షియల్‌ సూట్లలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. వారు అక్కడ ఉన్న సమయంలోనే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌, సంజయ్‌లు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. కిషన్‌రెడ్డి ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నుంచి నేరుగా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని ప్రసంగించారు. అప్పటికి సంజయ్‌ ప్రాంగణానికి చేరుకోలేదు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా తనకు దిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఉన్నందున వెళ్తున్నానని, ఎవరూ అపార్థం చేసుకోవద్దని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

పార్టీలో చేరిన ప్రముఖులు

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గానికి చెందిన రైస్‌మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌రెడ్డి, న్యాయవాది రచనారెడ్డి, శ్రీకాంత్‌ బీమ తదితరులకు కేంద్రమంత్రి షెకావత్‌, సంజయ్‌లు పార్టీ కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. పలు వ్యాధులతో బాధపడుతున్న పలువురు బాధితులకు తమ ఫౌండేషన్‌ తరఫున నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి, సంజయ్‌ల చేతుల మీదుగా అందజేశారు. భాజపాకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* కాగా సంజయ్‌ పాదయాత్ర యాదగిరిగుట్ట నుంచి దాసరిపల్లి, గంగసానిపల్లి మీదుగా మంగళవారం రాత్రికి బస్వాపూర్‌ చేరుకుంది.

అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం తెరాస: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెరాసది మాటల ప్రభుత్వమేనని... అవినీతి అక్రమాలకు ఇది ప్రతిరూపం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.‘‘కేసీఆర్‌ కేబినెట్‌లో 50 శాతం మంది ఉద్యమ ద్రోహులే. ఈ ఎనిమిదేళ్లలో ఏ ప్రధాని చేయని గొప్ప పనులు మోదీ చేస్తున్నారు. అదే ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ ఏం చేశారు? తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మాని ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించి, పబ్బం గడుపుకొంటున్నారు. కేంద్రం బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసింది. తెరాస వాళ్లొచ్చి, ఎయిమ్స్‌లో ఏం లేదని అంటున్నారు. రూ.900 కోట్లతో నూతన భవనానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. రూ.వందల కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో భాజపా జెండా ఎగిరింది. వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఇదే పునరావృతం అవుతుంది’’ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి: Munugodu: మూడు పార్టీలకూ మునుగోడు సవాల్‌.. సమరానికి సై అంటున్న నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.