ETV Bharat / state

గ్రీన్ ఫీల్డ్ హైవే.. రైతులను భూముల నుంచి ఖాళీ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు

author img

By

Published : Mar 8, 2023, 4:20 PM IST

HighCourt on Green Field National Highway: గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ ఆపాలంటూ రైతులు వేసిన పిటిషన్​పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రైతులను ఆ భూముల నుంచి ఖాళీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బాధిత రైతులు స్థానిక ఆర్డీఓను కలిసి కోర్టు తీర్పు పత్రాలను అందజేశారు. భూముల కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధం కానీ ఎట్టిపరిస్థితుల్లో తమ పొలాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

HighCourt on Green Field National Highway
HighCourt on Green Field National Highway

HighCourt on Green Field National Highway: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ ఆపాలంటూ హనుమకొండ జిల్లా బాధిత రైతులు వేసిన పిటిషన్ హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం రైతులను భూముల నుంచి ఖాళీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల-వరంగల్ హైవే పనుల నోటిఫికేషన్ నిలిపివేయాలని రైతులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాంతో 8 వారాల వరకు భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పర్యావరణ అనుమతి తీసుకోవాలని సూచించింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు పంపింది.

హనుమకొండ జిల్లాలో ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ ఫిబ్రవరి 22వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్​ను ప్రస్తుతానికి 8 వారాల పాటు నిలిపేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది. రైతులకు సానుకూలంగా తీర్పు రావడంతో బాధిత రైతులు హనుమకొండ జిల్లా పరకాల ఆర్డీఓ కార్యాలయంలో కోర్టు తీర్పు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు పచ్చటి పంట పొలాలను ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. భూముల కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'గ్రీన్​ఫీల్డ్ హైవే సమస్యపై హైకోర్టు నుంచి స్టే రావడంతో ఆర్డీఓను కలిసి వినతిపత్రం ఇచ్చాం. గతంలోను చాలా సార్లు ఆర్డీఓ దగ్గరికి వెళ్లి మా బాధ చెప్పుకున్నాం. ఈ రోజు మా కృషి ఫలించి హైకోర్టు స్టే ఇవ్వడంతో అధికారులు కొన్ని వారాలు పనులు ఆపడం జరుగుతుంది. భవిష్యత్తులోను ఎట్టి పరిస్థితులలో మా పచ్చని పొలాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేం. ఎట్టి పరిస్థితులలో మా భూములు ఇవ్వం. దీనికి బదులు మరో మార్గాన్ని చూపించాం.. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితులలో మా భూములు ఇవ్వం.'-రాంచందర్, భూ బాధితుడు

'నాకు ఉన్నది ఎకరన్నర భూమి. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా ఉన్న ఎకరన్నర భూమి పోతుంది. అది లేకపోతే మా జీవనం సాగదు. మందు పోసుకుని చావనైనా చస్తాం కానీ ఎట్టి పరిస్థితులలో ఆ భూమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే విషయంపై ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి వెళ్లాం. నా బిడ్డకు కట్నంగా ఇచ్చినా భూమి హైవేలో భాగంగా పోతుందని అల్లుడు కూడా తీసుకపోతలేడు. ఎట్టి పరిస్థితులలో పచ్చని పంటలు పండే మా భూమిని ఇవ్వము.'- రాజ కొమురయ్య, భూ బాధితుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.