ETV Bharat / state

Hanamkonda Wellness Centre : హన్మకొండలో వెల్​నెస్ సెంటర్లు వెలవెల

author img

By

Published : Jun 1, 2023, 1:56 PM IST

Wellness Centres in Hanamkonda : ఉద్యోగులు, పింఛనుదారుల వైద్యచికిత్సల కోసం ఏర్పాటుచేసిన హనుమకొండ వెల్‌నెస్‌ సెంటర్‌... కనీస వైద్యపరీక్షల నిర్వహణ లేక వెలవెలపోతోంది. రక్తపోటు, మధుమేహం స్థాయిల నిర్ధారణ వంటి సాధారణ పరీక్షలకూ దిక్కులేని దుస్థితి ఆ వెల్‌నెస్‌ సెంటర్‌ది. వైద్యపరీక్షల నిర్వహణకు రోగులు వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. ఓపిక నశించి బయటకెళ్లి పరీక్షలు చేయించుకొని వచ్చిన వారికి కనీసం డాక్టరు రాసిచ్చిన మందులు పూర్తిగా ఇవ్వట్లేదు. అస్తవ్యస్తంగా మారిన హనుమకొండ వెల్‌నెస్ సెంటర్‌ దుస్థితిపై కథనం

Wellness Centre Facilities In Hanmakonda District
హన్మకొండలో వెలవెల బోతున్న వెల్​నెస్ సెంటర్లు

హన్మకొండలో వెలవెల బోతున్న వెల్​నెస్ సెంటర్లు

Wellness Centre Facilities In Hanamkonda District : హనుమకొండ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వెల్‌నెస్‌ కేంద్రంలో రోగులకు కనీస వైద్యసాయం లభించడం లేదు. ఆ కేంద్రంలో కనీస డయాగ్నొస్టిక్‌ పరీక్షలు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఇవాళ, రేపూ అంటూ తిప్పుతున్నారని, చిన్నచిన్న పరీక్షలకి రోజుల తరబడి వెల్‌నెస్‌ సెంటర్‌ చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులను పరీక్షించే పరికరాలు పాడైపోయాయి. పలుచోట్ల నుంచి వైద్యచికిత్సల కోసం వచ్చే రోగులను సదుపాయాల కొరత వెక్కిరిస్తోంది.

"పేరుకే ఈ హాస్పిటల్ ఉంది. సరైన సౌకర్యాలు లేవు. అనుభవజ్ఞులైన డాక్టర్లు లేరు. సరైన పరికరాలు లేవు. రోగులకు సరైన వైద్య పరీక్షలు కూడా ఇక్కడ జరగడం లేదు. ఈ సమస్యలపై అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఎలాంటి చెకప్​లు చేయటం లేదు. కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు." - స్థానికులు

"కష్టాల్లో ఉండి హెల్త్ కార్డు మీదనే చూపించుకోవాలని ఇక్కడకి వస్తున్నాం. మందు​లు కూడా కొన్ని ఇక్కడ ఇస్తారు. కొన్ని బయట తెచ్చుకోమని చెబుతుంటారు. గతకొన్ని రోజులుగా ఇక్కడ ఎలాంటి పరీక్షలు చేయటం లేదు. ఎలాంటి టెస్ట్ చేయాలన్న ఏదో ఒక కారణం చెబుతున్నారు. ఒక వారం నుంచి తిరుగుతున్నా ఎలాంటి స్పందన రావటం లేదు. ఇక్కడకి రావటం కంటే బస్తీ దవాఖానాకు వెళ్లడం బెటర్. సీనియర్ డాక్టర్లను ఇక్కడకు రిక్రూట్ చేయాలని కోరుతున్నాం." - స్థానికులు

కొత్తవాటికి ఇండెంట్ పెట్టాము : ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్యసమస్యలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఆ వెల్‌నెస్‌ సెంటర్‌లో సమస్యలు తిష్టవేశాయి. వ్యాధులతో బాధపడేవారికి సాంత్వన చేకూర్చాల్సిన ఆ ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది. వైద్యపరీక్షలు, పరికరాల పనితీరుపై సిబ్బందిని ప్రశ్నిస్తే కొత్తవాటికి ఇండెంట్ పెట్టామని త్వరలోనే వస్తాయని సమాధానం ఇస్తున్నారు.

"టెస్ట్​లు చేసేవాళ్లం. కొన్ని రోజుల క్రితం మిషన్లు పాడయిపోయాయి. ఇంకో వారంలో కొత్త పరికరాలు వస్తాయి." - డ్యూటీ నర్సు, హనుమకొండ వెల్‌నెస్‌ సెంటర్‌

వైద్యులను నియమించాలి : ఓ వైపు వైద్యుల కొరత వేధిస్తుంటే... ఉన్నవారు వేళకు ఆసుపత్రికి రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, ఫించనుదారుల వైద్యచికిత్సల కోసం ఏర్పాటుచేసిన హనుమకొండ వెల్‌నెస్‌ సెంటర్​లో నిపుణులైన వైద్యులను నియమించాలని, పాడైన పరికరాలను మరమ్మతు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.