ETV Bharat / state

Temple land acquisition in Wanaparthy : ప్రభుత్వ భూములు సగం దేవాలయానికి.. మరో సగం స్వాహా

author img

By

Published : Jun 3, 2023, 2:14 PM IST

Etv Bharat
Etv Bharat

Hanuman Temple Land issue in Wanaparthy : జాతీయ రహదారికి ఆనుకుని దేవుని పేరిట ఉన్న భూమి కోట్లు పలుకుతోంది. ధూపదీప నైవేద్యాలు, ఆలయ నిర్వాహణకు కేటాయించిన ఆ భూములపై స్వాధీన హక్కు పత్రాలు పొందేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. కలెక్టర్లు దేవాలయ భూములని తేల్చిన వాటికి ఇటీవలే అధికారులు ఓఆర్​సీ జారీ చేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఆ భూముల్లో 40 ఏళ్లకు పైగా పెబ్బేరు సంత సాగుతోంది. ఆ భూముల కోసం జనం ఉద్యమించడంతో సగం భూముల్ని సంత కోసం ఇచ్చి మిగిలిన వాటిని కాజేసేందుకు రంగం సిద్ధమైంది.

దేవాలయ భూములను కాజేసేందుకు పలువురు ప్రయత్నం

Venugopala swamy Temple lands issue in Wanaparthy : వనపర్తి జిల్లా పెబ్బేరులో వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. వాటికి దేవుడి పేరుమీదున్న సర్వే నంబర్‌ 392లో 15.18ఎకరాలు 405లో 15.01ఎకరాలున్నాయి. ఖాస్రాలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పూజారి అంటూ మాఫీఇనామ్‌గా నమోదయ్యింది. ఐతే పాత పహానీల్లో మాత్రం శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పూజారి నంబి రామలక్ష్మయ్య పేరిట దేవస్థానం ఇనాంభూమి నమోదై ఉంది. ఆ భూములకు ఓఆర్​సీ తెచ్చుకునేందుకు గతంలో కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవల ఆ భూములకు ప్రభుత్వం ఓఆర్సీ ఇవ్వడంతో వివాదం రాజుకుంది.

Temple land occupied in wanaparthy : ఆలయ భూముల్లో 40 ఏళ్లుగా పెబ్బేరు సంతనడుస్తోంది. పశువులు, గొర్రెలు, రైతుబజారు కలిపి ప్రతి శనివారం అక్కడే సంత నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో ఆ స్థలం ఖాళీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఆ సంతకు వస్తుంటారు. తద్వారా పురపాలికకు ఏటా 3కోట్ల ఆదాయం వస్తోంది. ఆలయ భూమికి ఓఆర్​సీ ఇచ్చి పట్టాలు చేయడంపై స్థానికులు పెద్దఎత్తున ఉద్యమించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత రంగంలోకి దిగారు.

Lands kabza in Telangana : 30ఎకరాల్లో ఓఆర్​సీ ఇచ్చి, పట్టాలు పొందిన వారితో సంతకు 16ఎకరాల స్థలాన్ని స్వచ్ఛందంగా ఇస్తున్నట్లుగా ఈ మార్చి 1న 12.28 ఎకరాలను పెబ్బేరు తహసీల్దారు పేరిట గిఫ్ట్‌డీడ్‌ చేశారు. మరో 3.12 ఎకరాలను త్వరలోనే తహసీల్దారు పేరు మీద గిఫ్ట్‌డీడ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ భూములను పట్టాగా మార్చి అందులో సగం కాజేసి, మరోసగం ప్రభుత్వానికి గిఫ్ట్‌ డీడ్‌గా ఇస్తున్నట్లు ప్రణాళిక రచించారు. సంతకు 16 ఎకరాల భూమి సరిపోదని స్థానికులు అభ్యంతరం తెలిపారు. మిగిలిన భూమినీ వదులుకోబోమని స్పష్టం చేస్తున్నారు.

Hyderabad-Bangalore National Highway land kabza : తహసీల్దార్‌ పేరిట ఉన్న 16ఎకరాలుపోగా మిగిలిన 14ఎకరాలను కాజేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆ భూమి ఎకరాకు 5 కోట్లకు పైనే పలుకుతోంది. ఓ స్థిరాస్తి వ్యాపారిని ముందు పెట్టి ఓ ముఖ్య నేత ఆ దందా నడిపారని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఆలయ భూములకు ఓఆర్​సీ ఇవ్వడానికి వీల్లేదు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలొచ్చాయి. ఉన్న భూమి అంతా రెవెన్యూశాఖ, పూజారులకు వెళ్తే ఆలయ నిర్వాహణ ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

"గతంలో ఆ దేవాలయ భూమిలో వారు ఉన్నట్టు కృష్ణయ్య ఓఆర్​సీని పొందారు. దీని మీద దేవాదాయ శాఖ వారు అఫిల్​కు వెళ్లారు. వాళ్లు తహసీల్దార్​ పేరు మీద 12 ఎకరాల 20 గుంటలు రిజిస్ట్రేషన్​ చేశారు. మరో 3 ఎకరాలు రిజిస్ట్రేషన్​ చేస్తారని నాకు సమాచారం తెలిసింది. ఓఆర్​సీలో ఉన్న నిబంధనలు ప్రకారమే అప్పటి తహసీల్దార్​ ఇచ్చి ఉంటారు. ఇందులో ఏమైనా తప్పు జరిగి ఉంటే చట్ట ప్రకారం కోర్టుకు వెళ్లవచ్చు."- అబ్రహం లింకన్, పెబ్బేరు తహసీల్దార్

స్థలాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమం : అన్ని దస్త్రాలు పరిశీలించాకే దేవాలయ భూములకు ఓఆర్​సీ ఇస్తారని పెబ్బేరు తహశీల్దార్ తెలిపారు. ఆ విషయంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులపై ఒత్తిడితెచ్చి.. అక్రమంగా ఓఆర్​సీ ఇప్పించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంత స్థలాన్ని రక్షించుకునేందుకు పెబ్బేరు వాసులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.