ETV Bharat / state

బీఎస్పీ నేత సత్యమూర్తిని ఇంటికి చేర్చిన పోలీసులు.. పెన్​డ్రైవ్​, సెల్​ఫోన్​ స్వాధీనం

author img

By

Published : Jun 28, 2022, 6:06 PM IST

BSP Leader Missing Case: 3 రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటినుంచి వెళ్లిపోయిన వికారాబాద్​ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తిని పోలీసులు సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. పెన్​డ్రైవ్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. సత్యమూర్తి భార్య అదృశ్యం కేసును కూడా త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

Police Brought BSP Leader Satyamurti to home safely
Police Brought BSP Leader Satyamurti to home safely

బీఎస్పీ నేత సత్యమూర్తిని ఇంటికి చేర్చిన పోలీసులు.. పెన్​డ్రైవ్​, సెల్​ఫోన్​ స్వాధీనం

BSP Leader Missing Case: వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తాండూరులోని ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో.. పెన్​డ్రైవ్, సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలలుగా సత్యమూర్తి భార్య కనిపించకుండాపోగా.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ సత్యమూర్తి ఆరోపించారు. ఆ తర్వాత పోలీసులపై ఆరోపణలు చేస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. 3 రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటినుంచి వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఉత్తరప్రదేశ్​లోని కాశీలో సత్యమూర్తి ఉన్నట్లు గుర్తించారు. అదే విషయాన్ని అక్కడి ఎస్పీకి చేరవేసిన పోలీసులు... ప్రత్యేక బృందాన్ని పంపించి సత్యమూర్తితో పాటు ఇద్దరు కుమార్తెలను స్వస్థలానికి తీసుకొచ్చారు. ఇంట్లో స్వాధీనం చేసుకున్న పెన్​డ్రైవ్ , సెల్​ఫోన్​ను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తే సత్యమూర్తి భార్య ఆచూకీకి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

"సత్యమూర్తి ఫోన్ ఆఫ్ చేయడంతో కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేశాం. కాశీలో ఉన్నట్టు గుర్తించి ఇద్దరు కుమార్తెలతో సహా.. సత్యమూర్తిని సేఫ్​గా ఇంటికి తీసుకొచ్చాం. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ కేసును కూడా త్వరలోనే ఛేదిస్తాం. ఎఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతాం. సత్యమూర్తి చేసిన ఆరోపణల్లో అబద్ధం కూడా ఉండొచ్చు. కేసుకు సంబంధించి పూర్తి విషయాలను మీడియా ముందు వివరించడం కుదరదు. లోతుగా విచారణ చేసి.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం." -కోటిరెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.