ETV Bharat / state

పంచాయతీ కార్యాలయాల వల్లే స్త్రీశక్తి భవనాల కొరత?

author img

By

Published : Jun 20, 2020, 9:22 AM IST

అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ప్రజలకు సంతోషమే. తమకు ఇబ్బందులు తీరుతాయని భావిస్తారు. కానీ పని జరిగినా సమస్యలు తీరకుంటే ఏం లాభం. మళ్లీ అవస్థలు పడక తప్పని దుస్థితి. ఇందుకు వికారాబాద్​ జిల్లా పరిగి, దోమ మండల కేంద్రాల్లోని స్త్రీ శక్తి భవనాలే ఉదాహరణ.

lack of stree shakthi bhavans in vikarabad district
పంచాయతీ కార్యాలయాల వల్లే స్త్రీశక్తి భవనాల కొరత?

వికారాబాద్​ జిల్లాలో పొదుపు సంఘం సభ్యులు పనుల నిమిత్తం ప్రతినెలా సమావేశమవుతుంటారు. ఇందుకు గ్రామాల్లో ప్రత్యేకించి భవనాలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కేంద్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే అనుబంధ గ్రామాల్లో మరింత దారుణంగా ఉంటోంది. స్త్రీ నిధి రుణాలు, పొదుపు రికవరీ, సంఘాల పనితీరు, బ్యాంకు లింకేజీ, ఇతర ఆర్థికాభివృద్ధి పనులు, మార్కెటింగ్‌, పల్లెప్రగతి పథకం తదితరాలు పొదుపు సంఘాల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. దీంతో వారు ప్రతినెలా విధిగా రెండు మూడు సార్లు సమావేశమవుతుంటారు. అయినా అందరూ ఒకచోట కూర్చుని పరిస్థితులను అధ్యయనం చేయడం, సంఘాల పురోగతిపై చర్చించేందుకు అవకాశం లేకుండా పోతోంది.

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నా అవి క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు కావడం లేదు. పంచాయతీలకు కొత్త పాలకవర్గం రావడం, కొత్త పంచాయతీల ఆవిర్భావంతో గ్రామాల్లో గతంలో నిర్మించిన భవనాలు ప్రస్తుత పంచాయతీ కార్యాలయాలుగా మారిపోయాయి. పరిగి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దాదాపు 4550 పొదుపు సంఘాలు ఉండగా సుమారు 52,790 మంది సభ్యులున్నారు. వీరికి ప్రత్యేకించి అన్ని మండల కేంద్రాల్లో స్త్రీశక్తి భవనాలను నిర్మించారు. అందులోనే ఉపాధిహామీ కార్యకలాపాలు జరిగే విధంగా మరోవైపు నిర్మాణం చేపట్టి కేటాయింపులు పూర్తి చేశారు. కొన్ని చోట్ల నిబద్ధత కొరవడి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల స్త్రీ శక్తి భవనాలు వృథాగా మారగా ఉపాధిహామీ వారు మాత్రం వినియోగించుకుంటున్నారు.

స్త్రీ శక్తి భవనంలో మూడు చక్రాల సైకిళ్లు ఉన్నాయి. భవనం నుంచి వాటిని ఖాళీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అవి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. భవనం అప్పగిస్తే వినియోగంలోకి తీసుకువస్తాం. కొవిడ్‌ -19 కారణంగా సభ్యుల అవసరాలకు ప్రతి సంఘానికి రూ.50వేల రుణం అదనంగా బ్యాంకులు అందజేస్తున్నాయి. వారి అభ్యున్నతికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

- కె.శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం, పరిగి

పరిగిలోనూ అదే దుస్థితి..

పరిగి మండలంలో 830 సంఘాల పరిధిలో 42 గ్రామ సంఘాలున్నాయి. దాదాపు 10,223 మంది పొదుపు సంఘం సభ్యులున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.14.45కోట్లు బ్యాంకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 25 సంఘాలకు రూ.1.20లక్షలు అందజేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలతో ఇబ్బందులు కలిగాయి. పూడూరు మండలంలో 651 పొదుపు సంఘాలు 37 గ్రామ సంఘాలు పనిచేస్తుండగా 7809 మంది సభ్యులు ఉన్నారు. కుల్కచర్ల మండలంలో 1078 పొదుపు సంఘాలు ఉండగా 36 గ్రామ సంఘాలు 12,820 మంది సభ్యులు ఉన్నారు. దోమ మండలంలో 857 సంఘాల పరిధిలో 45 గ్రామ సంఘాలు 10,182 మంది సభ్యులు ఉన్నారు.

పంచాయతీ భవనాలు సైతం వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోరుతున్నారు. మండల కేంద్రంలో రూ.30లక్షల వ్యయంతో నిర్మించిన స్త్రీ శక్తి భవనం గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంది. కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయని వినియోగించడం లేదు. భవనం నిర్వహణ లేనందున ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా మారుతోంది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.