ETV Bharat / state

ఆయన కౌరవుల పక్కన నిలబడి ధర్మం గురించి మాట్లాడటం ఆశ్చర్యం: మంత్రి జగదీశ్‌

author img

By

Published : Nov 2, 2022, 4:35 PM IST

Updated : Nov 2, 2022, 4:54 PM IST

minister jagadeesh reddy
minister jagadeesh reddy

Minister Jagadeesh Reddy on Etela: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఓడిపోతామని తెలిసే ఈటల సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెరాస కార్యకర్తలపై భాజపా నేతలే దాడులు చేశారని విమర్శించారు.

Minister Jagadeesh Reddy on Etela: భాజపా నేత ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ ధర్మం, భాషపై మాట్లాడి సానుభూతి పొందలేరన్నారు. ముఖ్యమంత్రిపై భాజపా నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈటల రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు.

పరివెల గ్రామంలో భాజపాకు మెజారిటీ రాదని స్పష్టంగా తేలడంతో.. హైదరాబాద్ నుంచి వచ్చిన గూండాలు తెరాస కార్యకర్తలపై దాడి చేశారని మంత్రి ధ్వజమెత్తారు. గతంలో బంగాల్‌లో ఇలాగే దాడులు చేస్తే భాజపాకు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. హింసను కేసీఆర్ ఎప్పుడూ ఇష్టపడరని.. శాంతియుత వాతావరణం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం నమ్ముతారన్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ రాజకీయ ఘర్షణలు జరగలేదన్నారు. దాడులు చేయడం, మనుషులను మాయం చేసి.. సాక్షులు కనిపించకుండా చేయడం భాజపాకే సాధ్యమని అని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఏ క్షణంలో మాయమై పోతామోనని భాజపాలో పెద్ద నాయకులే భయపడుతున్నారన్నారు.

జరగబోయేది ధర్మయుద్ధమే... అందులో సందేహం లేదు.. ధర్మమే గెలుస్తుంది... ప్రజలే నిర్ణయిస్తారు. కానీ కౌరవుల పక్కన ఉండి ధర్మం గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. పలివెలలో భాజపా నేతలే తెరాస కార్యకర్తలపై దాడులు చేశారు. మా వాళ్లు కనీసం మోటర్ సైకిళ్లు కూడా దిగలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన గుండాలు దాడి చేశారు. మా వాళ్ల తలలు పగలగొట్టారు. పల్లా రాజేశ్వర్ తల కూడా పగలగొట్టారు. ప్రజలకు తెలుసు... ధర్మం ఏందో న్యాయం ఏందో వాళ్లే నిర్ణయిస్తారు. ఎవరు కౌరవుల పక్షాన నిలబడ్డారో తెలుసు. హింసను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రోత్సహించరు. ఓడిపోతామని తెలిసే ఈటల సానుభూతి మాటలు మాట్లాడుతున్నారు. - మంత్రి జగదీశ్‌రెడ్డి

కేంద్ర సంస్థలను అడ్డుపెట్టి తనను మునుగోడు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ.. సానుభూతి కోసం తాను ప్రయత్నించలేదన్నారు. జనం లేకనే భాజపా నేతలు సభలు రద్దు చేసుకున్నారన్నారు. ఐటీ దాడులకు ఎవరు పురికొల్పుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని.. రాష్ట్ర పోలీసులు భాజపా నేతల ఇళ్లల్లో సోదాలు చేయడం లేదని మంత్రి అన్నారు. పార్టీని నడపలేక పారిపోయిన రాహుల్ గాంధీ.. ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీని రాహుల్ గాంధీ ముద్దు పెట్టుకున్నప్పుడే అంతర్గత ఒప్పందం ఎవరి మధ్య ఉందో దేశానికి తెలిసిపోయిందన్నారు.

ఆయన కౌరవుల పక్కన నిలబడి ధర్మం గురించి మాట్లాడటం ఆశ్చర్యం: మంత్రి జగదీశ్‌

ఇవీ చదవండి:

Last Updated :Nov 2, 2022, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.