ETV Bharat / state

కొమురవెల్లి మల్లన్న చెంత.. వసతుల చింత

author img

By

Published : Dec 14, 2022, 9:31 AM IST

Komuravelli Mallanna Temple
Komuravelli Mallanna Temple

Lack Of Facilities In Komuravelli Temple: తెలంగాణ సంస్కృతి ఆచారవ్యవహారాలకు ప్రతీక కొమురవెల్లి మల్లికార్జున స్వామి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆ ఆలయానికి.. స్వరాష్ట్రంలోనూ తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. కొరమీసాల మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యాలే స్వాగతం పలుకుతున్నాయి. మూడ్రోజుల్లో స్వామివారి కల్యాణం ఉన్నా.. తాత్కలిక సౌకర్యాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది.

కొమురవెల్లి మల్లన్న చెంత.. వసతుల చింత

Lack Of Facilities In Komuravelli Temple: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని.. మల్లన్నగా పిలుచుకుంటూ భక్తులు ఇలవేల్పుగా పూజిస్తారు. సంక్రాంతి తర్వాత ఆదివారం మొదలై.. ఉగాది తర్వాత ఆదివారం వరకు 3నెలల పాటు ఏటా కొమురవెల్లి జాతర జరుగుతుంది. ఈ వేడుకకు తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల భక్తులు తరలివస్తారు. మార్గశిర మాసం చివరికావడంతో వచ్చే ఆదివారం స్వామివారి కల్యాణం జరగనుంది. భక్తుల రాకతో ఆలయానికి కోట్ల ఆదాయం సమకూరుతున్నా వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంది.

నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన: ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్వామివారి దర్శనానికి క్యూలో ఉన్న భక్తులకు మంచినీళ్లు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుట్టపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు దివ్యాంగులు, వృద్ధుల కోసం.. ఏళ్లుగా లిఫ్ట్ నిర్మాణం సాగుతోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో ఎక్కువ మంది రాత్రి బస చేసి.. ఉదయం దర్శనం చేసుకుంటారు. అలాంటి వారి వసతికి ఇబ్బందులు తప్పడంలేదు.

కాటేజీల నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు: గతంలో భక్తుల కోసం నిర్మించిన 147 కాటేజీల నిర్వహణను ఆలయ అధికారులు గాలికొదిలేయగా వాటిలో సగానికిపైగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వేములవాడ, శ్రీశైలందేవస్థానాలు రెండు అతిథి గృహలు నిర్మించగా.. అందులో ఒకటి పోలీస్‌స్టేషన్​కు.. మరొకటి ఎంపీడీవో కార్యాలయం నిర్వహిస్తున్నారు. రూ.13 కోట్లతో నిర్మిస్తున్న ధర్మశాల పనులు నాలుగున్నరేళ్లుగా సాగుతున్నాయి. భక్తులు స్నానాలు చేసే కోనేరు నిర్వహణ సరిగా లేదు.

సమస్యలకు నిలయంగా: స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాజీవ్ రహాదారి నుంచి తిమ్మారెడ్డిపల్లి మీదుగా మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుంటారు. కానీ తిమ్మారెడ్డిపల్లి వద్ద రైల్వే వంతెన పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. రెండు నెలల్లో పూర్తికావాల్సిన పనులు.. ఏడు నెలలు గడుస్తున్నా అసంపూర్తిగానే ఉన్నాయి. అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లోపం వెరసి.. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం సమస్యలకు నిలయంగా మారింది. మరో నాలుగు రోజుల్లో కల్యాణం ఉన్నా.. పనులు మాత్రం నత్తనడకనే సాగుతుండటంతో మల్లన్న భక్తులకు అసౌకర్యాలే స్వాగతం పలకనున్నాయి.

"భక్తులకు అసౌకర్యంగా ఉంది. మరుగుదొడ్లు, కనీస వసతులు లేవు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఏళ్లుగా లిఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకవర్గం దృష్టి సారించి వసతులు కల్పించాలి." - స్థానికులు

ఇవీ చదవండి: దిల్లీలో నేడే బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం..

ఖండాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన భారతీయ యువకుడు, జర్మనీ యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.