ETV Bharat / state

'కొండపోచమ్మ​'కు ముహూర్తం ఖరారు

author img

By

Published : May 2, 2020, 10:57 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. జలాశయానికి ఈ నెల 4న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నీటి విడుదల చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీ, భూమి పరిహారం తేలేదాకా నీటిని విడుదల చేయరాదన్న ముంపువాసుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ నీటి విడుదలకు అనుమతించింది.

kondapochamma project will start on 4th this month in siddipeta
కొండపోచమ్మసాగర్​ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

కొండపోచమ్మ సాగర్​ ప్రారంభోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడం వల్ల ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్​ నీటివిడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం, పరిహారం ప్యాకేజీ అమలు చేయకుండా బలవంతంగా ఖాళీ చేయించడంపై మామిడ్యాల, బహిలాంపూర్ గ్రామస్థులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇళ్లను ఖాళీ చేయడానికి మే1 వరకు హైకోర్టు గడువు ఇచ్చినా.. ఏప్రిల్ 30న రాత్రి 600 మందికి పైగా పోలీసులు గ్రామాలను చుట్టుముట్టి బలవంతంగా ప్రజలను ఖాళీ చేయించారని చెప్పారు. ఫోన్లు పనిచేయకుండా చేశారని తెలిపారు.

కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం

బలవంతంగా ఖాళీ చేయించడంపై కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని బ్రిటీష్‌రాణి నియమించలేదని.. ఇది బ్రిటీష్‌ రాజ్యంకాదని వ్యాఖ్యానించింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికింది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల్ని బాగా చూసుకోవాలని.. గత పాలకుల్లాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. చిన్న పిల్లల ముందు.. తల్లిదండ్రులు, బంధువులను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించి వాటిని కూల్చివేస్తే రాజ్యంపై వారికి వ్యతిరేకత ఏర్పడుతుందని, వాళ్లు నక్సల్స్​గా మారితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది.

ఈనెల 6లోగా నివేదిక

ఈ విషయంపై బాధితుల నుంచి సీఆర్​పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేసి.. ఈనెల 6లోగా నివేదిక పంపాలని సిద్దిపేట నాలుగో అదనపు జిల్లా జడ్జిని ఆదేశించింది. 110 ఎకరాల్లోని పంటను కోసి ధాన్యాన్ని రైతులకు అప్పగించాలని.. వారికి నిల్వ చేసేఅవకాశం లేకపోతే ప్రభుత్వమే నిల్వ చేసి అప్పగించాలని సూచించింది. కోతదశకు రాని పంటకు నష్టం అంచనా వేసి పరిహారాన్ని రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

97 శాతం మంది స్వచ్ఛందంగా తరలిపోయారు

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బిఎస్​.ప్రసాద్, ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ 97 శాతం మంది స్వచ్ఛందంగా తరలిపోయారని, కేవలం 3 శాతం మందే అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. వారిని పునరావాస ప్రాంతానికి తరలించడానికి.... అన్ని ఏర్పాట్లు చేశామని పశువులను డాక్టర్ సమక్షంలో తరలించి.. వాటి సంరక్షణకు అవసరమైన షెడ్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

నెల 4న సీఎం చేతుల మీదుగా

నిర్వాసితులకు అవసరమైన భోజన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 4న సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. అవార్డును సవాలు చేశామని.. అది తేలేదాకా నీరు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం నిరాకరించింది. ప్రజాప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఒకసారి అవార్డు జారీ అయ్యాక జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. పరిహారం, పునరావాసం నిబంధనల ప్రకారం అందేలా చూస్తామని పేర్కొంది. ముంపు వాసులు కోరుకుంటే గజ్వేల్‌లో రెండు పడకల గదులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.