ETV Bharat / state

కుర్చీ వేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు.. ఏమైంది?: చాడ

author img

By

Published : Apr 5, 2021, 6:52 PM IST

chada fire on cm kcr, chada venkat reddy press meet
సీఎం కేసీఆర్​పై చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం, చాడ వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్

గౌరవెల్లి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగునీరు అందక ఆ ప్రాంత పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఆగిపోయిన ప్రాజెక్టులకు పది రోజుల్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టులతో పాటు కాలువల నిర్మాణాలకు మరో రూ.1000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈసారి బడ్జెట్​లో మాత్రం రూ.99 కోట్లు కేటాయించారని... ఇలా అయితే ఎప్పటివరకు పూర్తవుతాయని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

నైతిక బాధ్యత వహించాలి

ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ 80 శాతం, గండిపల్లి ప్రాజెక్ట్ 46 శాతం మాత్రమే పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరో 5 వేల ఎకరాల భూమి అవసరమన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక ఈ ప్రాంత రైతుల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పంటలు ఎండిపోయి ఏలేటి సంపత్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని... దీనికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు.

ఆదుకోవాలి

ఆగిపోయిన ప్రాజెక్టులకు పది రోజుల్లో నిధులు కేటాయించి... పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద టెంట్ వేసుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వేసవిలో బావులు, బోర్లు ఎండిపోయాయని అన్నారు. విపత్తు నిర్వహణ శాఖ నుంచి నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్​కు తాను ఇటీవలే లేఖ రాసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్​పై చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం, చాడ వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్

ఇదీ చదవండి: అనాథ విద్యార్థి గృహంలో 45 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.