ETV Bharat / state

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

author img

By

Published : Mar 2, 2020, 5:37 AM IST

హైదరాబాద్ నగరానికి పక్కనే ఉన్న ప్రాంతం. చుట్టూ ఆకాశ హర్మ్యాలు. ఎకరా కనీసం పది కోట్లు పలుకుతుంది. ఇంతటి విలువైన ప్రాంతంలో మతం, సేవల పేరిట ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. ఆక్రమణదారులు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నా అడ్డుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

government-land-kabza-in-ameenpur-hyderabad
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ హైదరాబాద్‌కు ఆనుకొని ఉంటుంది. మియాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు సమీపంలో ఉండటం వల్ల ఇక్కడి భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీనితో కొంతమంది ప్రభుత్వ భూములపై కన్నేశారు. అమీన్‌పూర్‌లోని సర్వే నెంబర్ 993లో 423 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 96ఎకరాల 28 గుంటలను అధికారికంగా కొందరికి కేటాయించారు. తీసుకున్నవారు నిబంధనలను ఉల్లంఘించారంటూ 37 ఎకరాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మిగతా భూమిలోని 147 ఎకరాల్లో క్రమంగా కాలనీలు వెలిశాయి. తామంతా పేదలమని 58, 59 జీవోల కింద క్రమబద్ధీకరణ చేయాలంటూ వారు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

మతం, సేవల పేరిట కబ్జా

ఇదే సర్వేనెంబర్‌లో భ్రమరాంభ మల్లికార్జున స్వామి పేరుతో గోశాల ఏర్పాటు చేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మించి షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోనే శాశ్వత భవనాలతో పాటు మందిరాన్ని నిర్మించారు. సాయిబాబా మందిరాన్ని నిర్మించుకునేలా మరొకరిని సైతం ఆహ్వానించారు. వారు ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుని శాశ్వత మందిరాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

చర్యలు తీసుకుంటామన్న అధికారులు

అయితే ఇది ప్రభుత్వ భూమి అని తమకు తెలియదని గోశాల ప్రతినిధులు ఆహ్వానించడం వల్లే ఆలయం ఏర్పాటు చేశామని సాయిబాబా మందిరం నిర్వాహకులు చెబుతున్నారు. గోశాల, సాయి మందిరం మొత్తం ఐదెకరాల్లో విస్తరించి ఉన్నట్లు స్థానిక రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని.. వారి సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.

50కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడే చర్యలకు అధికారులు ఉపక్రమించాలని స్థానికులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.