ETV Bharat / state

వర్షాలతో వన్య ప్రాణులకు రక్ష.. ఫలిస్తున్న అటవీశాఖ చర్యలు

author img

By

Published : Jan 25, 2021, 12:43 PM IST

అటవీ శాఖ చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యలతో జిల్లాలో వనాలు వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి మెదక్‌ పరిధిలో సంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. అందులోనూ జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో 6500 ఎకరాల్లో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఆరేళ్లుగా అటవీశాఖ చేపట్టిన వివిధ పనులు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుతున్న తీరును ఒకసారి పరిశీలిద్దాం.

forest department  activities successful in sanga reddy district
వర్షాలతో వన్య ప్రాణులకు రక్ష.. ఫలిస్తున్న అటవీశాఖ చర్యలు

సంగారెడ్డి జిల్లాలో అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుతోంది. ఫలితంగా వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ఆరేళ్ల కాలంలో అటవీభూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

కలప రవాణాకు అడ్డుకట్ట

గతంలో అడవుల నుంచి కలప రవాణా యథేచ్ఛగా కొనసాగేది. ఇళ్ల నిర్మాణంతో పాటు పరిశ్రమలు, ఇటుకబట్టీలు, ఇతర అవసరాలకు కలపను తరలించడంతో అడవులు అంతరించి పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంపై అటవీశాఖ దృష్టి సారించింది. దీంతో పాటు రెండేళ్ల నుంచి అడవుల చుట్టూ కందకాలు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కలప రవాణాదారుల వాహనాలు అడవుల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. కేవలం కలపే కాకుండా అటవీ సంపద, భూములకు రక్షణ కల్పించినట్లుయింది.

ముందుకొచ్చిన దాతలు

జిల్లాలో వనాలను వృద్ధి చేసేందుకు నాబార్డు నిధులతో పాటు.. దాతల సహకారం కలిసివస్తోంది. జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సినీ నటుడు ప్రభాస్‌, గుమ్మడిదల మండలం మంబాపూర్‌ అటవీ ప్రాంతాన్ని పారిశ్రామికవేత్త పార్థసారిధిరెడ్డి దత్తత తీసుకున్నారు. కొడకంచి, కానుకుంట అడవులను నాబార్డు నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే జిన్నారం, రొయ్యపల్లి, మంగంపేట, బొంతపల్లి, నాగారం తదితర అడవుల చుట్టూ హెచ్‌ఎండీఏ కంచె ఏర్పాటు చేసింది. దీంతో అడవులకు కలప అక్రమార్కులు వెళ్లే సాహసం చేయడం లేదు.

నీటి సౌకర్యం..

ఐదారేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయి. ఫలితంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న చెక్‌డ్యామ్‌లు, కుంటలు, చెరువులు, వాగులు, ట్యాంకులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాసర్‌పిట్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అడవి జంతువులు నీటి కోసం పల్లెల వైపు వచ్చే పరిస్థితి చాలా వరకు తగ్గుముఖం పట్టిందని అటవీశాఖ అధికారి ఒకరు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు.

జంతువులకు అభయం

అడవులను కట్టుదిట్టం చేయడంలో వన్యప్రాణులకు రక్షణ కల్పించినట్లయింది. గతంలో అడవులు బోసిపోవడంతో వన్యప్రాణులు పూర్తిగా అంతరించిపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేసేవారు. అటవీ శాఖ తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జనాభాకు అనుగుణంగా అడవులను పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. హరితహారంలోనూ అడవుల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో అడవులు చెట్లతో దట్టంగా మారుతుండటంతో క్రమంగా వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఏడు చిరుతలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జింకలు, మనుబోతులు, కొండగొర్రెలు, అడవి పందులు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, నెమళ్ల సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొంటున్నారు. గతంలో లాగా జంతువులను వేటాడే ఘటనలు సైతం చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిన్నారం, గుమ్మడిదల, జహీరాబాద్‌, నర్సాపూర్‌, మెదక్‌, సిద్దిపేట, కొండపాక తదితర ప్రాంతాల్లో అడవుల విస్తీర్ణం ఎక్కువగా వృద్ధి చెందుతోంది.

జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లోని అడవుల చుట్టూ కంచె ఏర్పాటు, కందకాలు తవ్వడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దీంతో అడవులకు రక్షణ ఏర్పడి చెట్లు ఎదుగుతున్నాయి. నాలుగైదు ఏళ్లలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాతల సహకారం, ప్రభుత్వ నిధులతో అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.

- రఘుపతిస్వామి, అటవీశాఖ సెక్షన్‌ అధికారి, జిన్నారం

ప్రభుత్వం అడవుల సంరక్షణపై ఎక్కువ దృష్టి సారించింది. ఇందులో భాగంగా హరితహారాన్ని ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. దీని వల్ల భవిష్యత్‌లో మొక్కలు పెరిగి అడవులు దట్టంగా మారనున్నాయి. ఊరూరా వన నర్సరీలను ఏర్పాటు చేసి.. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటడంతో పాటు.. ప్రతి గ్రామంలో, పట్టణాల్లో పార్కులు, పల్లె ప్రకృతి వనాల పెంపు కోసం కృషి చేస్తున్నాం.

- వెంకటేశ్వరరావు, జిల్లా అటవీ శాఖ అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.