ETV Bharat / state

ఏపీలో విస్తారంగా వర్షాలు.. నిండుకుండల్లా రిజర్వాయర్లు

author img

By

Published : Sep 29, 2020, 6:51 PM IST

ఏపీలో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. మధ్య, దక్షిణ భారత్​లో వాతావరణ పరిస్థితుల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లోని వివిధ రిజర్వాయర్లలో 841.61 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు జలవనరుల శాఖ తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించాక జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో కురిసిన వర్షం 3 వేల 969 టీఎంసీల మేర ఉంటుందని అంచనా వేసింది.

heavy-rains-in-ap-dot-all-reservoirs-filled-with-water
ఏపీలో విస్తారంగా వర్షాలు.. నిండుకుండల్లా రిజర్వాయర్లు

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా ఈసారి విస్తారంగా వర్షాలు కురిశాయి. రిజర్వాయర్లు అన్నీ నిండు కుండల్లా మారాయి. ఏపీలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లలోనూ 841.61 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు జలవనరుల శాఖ చెబుతోంది. ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలోనూ 85 శాతం మేర నీరు నిల్వ ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 108 రిజర్వాయర్లలో ఈ మొత్తం నీరు నిల్వ ఉందని జలవనరుల శాఖ స్పష్టం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలంలో ప్రస్తుతం 210 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 97 శాతం మేర రిజర్వాయర్​ను నింపారు. ఎగువ నుంచి దాదాపు 5 లక్షల 76 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్న పరిస్థితుల్లో.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.

నాగర్జునసాగర్​నూ దాదాపు పూర్తి సామర్ధ్యంతో నీటిని నిల్వ చేశారు. రిజర్వాయర్​లో ప్రస్తుతం 310 టీఎంసీల మేర నీటిని నిల్వ చేశారు. మరో రెండు టీఎంసీలను కూడా నిల్వ చేసేందుకు అవకాశముంది. ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు 4 లక్షల 19 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇక పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల పూర్తి సామర్ధ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 42.72 టీఎంసీల నీటి నిల్వ చేశారు. మరో 3 టీఎంసీలను నిల్వ చేసేందుకు అవకాశముంది.

ఇక ప్రకాశం బ్యారేజీ పూర్తి సామర్ధ్యం మేరకు 3 టీఎంసీలను నిల్వ చేశారు. ఎగువనుంచి వస్తున్న 7 లక్షల క్యూసెక్కుల నీటిని యథాతథంగా సముద్రంలోనికి జారవిడుస్తున్నారు. ఏలేరు, బ్రహ్మసాగర్, తాండవ, గుండ్లకమ్మ, తోడపల్లి, గొట్టా బ్యారేజీల్లోనూ 80 నుంచి వందశాతం మేర నీటిని నిల్వ చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈసారి పెన్నాకు కూడా అసాధారణ రీతిలో వరద రావటంతో సోమశిల రిజర్వాయర్​లోనూ 73 టీఎంసీల మేర నీటిని నిల్వచేశారు. కండలేరులో ప్రస్తుతం 60 శాతం మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. గండికోట, చిత్రావతి రిజర్వాయర్లలో 65 శాతం మేర, మైలవరం, పైడిపాలెం తదితర చోట్ల కేవలం 21 నుంచి 34 శాతం మాత్రమే నీరు నిల్వ ఉంది.

దేశంలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించిన అనంతరం ఆంధ్రాలో 3969 టీఎంసీల మేర వర్షం కురిసిందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రాలోని 37 వేల పైచిలుకు చెరువుల్లో 83.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువలు వెడల్పు లేకపోవటంతో పాటు ఇతర కారణాల వల్ల వీటిని కేవలం 40 శాతం మేర మాత్రమే నింపగలిగారు. ఇక ఏపీ వ్యాప్తంగా 187.29 టీఎంసీల మేర భూగర్భ జలాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. భూగర్భజలాల లభ్యత సగటున 12.73 మీటర్లుగా నమోదైంది. ఇక అటవీ ప్రాంతాలతో పాటు కరవు ప్రాంతాల్లో నిర్మించిన 13 లక్షల పైచీలుకు నీటి సంరక్షణ కట్టడాలు, చెక్ డ్యాములు తదితరాల్లో దాదాపుగా 28.82 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఉపరితల రిజర్వాయర్లు, చెరువులు, నీటి కట్టడాలు, భూగర్భంలోనూ మొత్తంగా 1807.73 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి: పట్టాలెక్కుతున్న జన జీవితం..పుంజుకుంటున్న కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.