ETV Bharat / state

GREENARY: పచ్చదనంతో కళకళలాడుతున్న జాతీయ రహదారులు

author img

By

Published : Jul 2, 2021, 4:55 AM IST

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారులు ఇరువైపులా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. హరితహారం కింద జిల్లాలో 44, 63 జాతీయ రహదారులకు పక్కన నాలుగైదు వరుసల్లో అధికారులు మొక్కలు నాటుతున్నారు. రెండు రహదారుల్లో 75వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయగా.. ఇప్పటికే రెండు మండలాల్లో నాటడం పూర్తయింది. జాతీయ రహదారులకు ఇరువైపులా మరిన్ని మొక్కలు నాటాలన్న సీఎం ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణతో అధికారులు ముందుకెళ్తున్నారు. గత 20రోజులుగా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

GREENARY: పచ్చదనంతో కళకళలాడుతున్న జాతీయ రహదారులు
GREENARY: పచ్చదనంతో కళకళలాడుతున్న జాతీయ రహదారులు

GREENARY: పచ్చదనంతో కళకళలాడుతున్న జాతీయ రహదారులు

నిజామాబాద్ జిల్లాలో 44, 63 నంబర్ జాతీయ రహదారులు ఉన్నాయి. జిల్లాలోని ఇందల్వాయి టోల్​ప్లాజా పరిధిలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ నుంచి ఆర్మూర్ వరకు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. అలాగే బోధన్ నుంచి జిల్లాలోని కమ్మర్​పల్లి వరకు 63 రహదారికి పక్కన కూడా మొక్కలు నాటుతున్నారు. ఇందు కోసం గత 20రోజులుగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ జాతీయ రహదారుల పక్కన ఇంకా మొక్కలు నాటాలని సూచించడంతో జిల్లా అధికారులు అవెన్యూ ప్లాంటేషన్​కు సిద్ధమయ్యారు. అటవీశాఖతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి భారీ ఎత్తున మొక్కలు నాటిస్తున్నారు. నాటిన మొక్కలను బతికించుకునేందుకు సైతం కార్యాచరణ చేపట్టారు.

రహదారులకు ఇరువైపులా..

మల్టీ లేయర్ విధానంలో జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే రెండు జాతీయ రహదారులకు ఇరు వైపులా నాలుగు నుంచి ఐదు వరుసల్లో గుంతలు తీశారు. వీటిలో ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తున్న మొక్కలు నాటుతున్నారు. ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వాటర్ ట్యాంక్, వాచర్​ను ఏర్పాటు చేసి మొక్కలను బతికించుకునేందుకు ఆదేశాలిచ్చారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోతే.. ఆ స్థానంలో కొత్తగా మొక్కలు నాటుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలోనూ ఆర్ అండ్ బీ, పీఆర్ రహదారులలోనూ ఉపాధి హామీ కింద ఇదే విధంగా మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. మొక్కలు పాడైతే రూ.5వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని రోడ్లలోనూ మల్టీ లేయర్ విధానంలో మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు.

మొక్కలను బతికించుకునేందుకు..

ఇప్పటికే జిల్లాలో డిచ్​పల్లి, ఇందల్వాయి మండలాల్లో జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. జక్రాన్ పల్లి, ఆర్మూర్, కమ్మర్ పల్లి, ఎడపల్లి, బోధన్ మండలాల్లోనూ నాటేందుకు మొక్కలు తెప్పించారు. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రతి రోజూ అవెన్యూ ప్లాంటేషన్​ను పరిశీలిస్తున్నారు. అవసరమైన సూచనలు ఇస్తూ మొక్కలను బతికించుకునేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

జిల్లాలో మొక్కలు నాటుతుండటంతో జాతీయ రహదారులు చూడటానికి అందంగా కనిపిస్తున్నాయి. పచ్చని ప్రకృతి రమణీయతను సొంతం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది.

ఇదీ చదవండి: తేనెతుట్టెలోని తేనెను పిండి... ఆ మాధుర్యాన్ని ఆస్వాదించిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.