ETV Bharat / state

Vasantha Panchami 2022: బాసర ఆలయంలో కిటకిట.. క్యూలైన్లలో భక్తులు విలవిల

author img

By

Published : Feb 5, 2022, 8:24 AM IST

Updated : Feb 5, 2022, 5:33 PM IST

Saraswati temples are bustling with devotees on Vasantha Panchami
Saraswati temples are bustling with devotees on Vasantha Panchami

Vasantha Panchami 2022: వసంత పంచమిని పురస్కరించుకొని బాసర సరస్వతీ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. గత రెండేళ్లుగా కరోనాతో రాలేకపోయిన భక్తజనం ఈసారి భారీగా వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ యంత్రాంగం విఫలం కావడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. మంచినీటి నుంచి మొదలుకొని దర్శనం వరకు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్మవారి నామ స్మరణకు బదులు పిల్లలు ఏడుపులతో క్యూలైన్లు మారుమోగాయి. ఆలయ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా బాసరకు వచ్చిన భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.

Vasantha Panchami 2022 : వసంత పంచమిని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు బాసరకు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడితో బాసర క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తజనం క్యూలైన్లలో బారులు దీరారు. తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

saraswati-temples-are-bustling-with-devotees-on-vasantha-panchami
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తోన్న మంత్రి

ఆలయంలో భక్తుల కోలాహలం

అమ్మవారి పుట్టిన రోజుగా భావించే వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి విద్యాబుద్ధులు వస్తాయని భక్తుల నమ్మకం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. దక్షణ భారతదేశంలోనే ఉన్న ఏకైక ఆలయం కావడంతో ప్రతి ఏటా వసంత పంచమి, దసరా నవరాత్రుల్లో భక్తుల రద్దీగా అధికంగా ఉంటుంది. ఈ ఏడాది సైతం నిన్నటి నుంచే భక్తులు ఆలయానికి భక్తుల రాక మొదలైంది. శనివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి చూశారు. రెండు గంటలకు గుడి తలుపులు తెరిచి... అభిషేకం చేసిన అనంతరం విశేషాలంకరణ, హారతి పూర్తయ్యాక.. మూడు గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభించారు.

చేతులెత్తేసిన యంత్రాంగం

గత రెండేళ్లుగా కరోనా కారణంగా భక్తులు ఈ దివ్య క్షేత్రానికి రాలేకపోయారు. ఇప్పుడు కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో వసంత పంచమి సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. భారీ క్యూలైన్లు ఏర్పాటు చేసినా భక్తులకు కనీసం మంచినీళ్లు అందుబాటులో ఉంచలేకపోయారు. ఇక పిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో ఉండలేక నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలు క్యూలైన్లలో ఉన్నంతసేపూ ఏడుస్తూనే ఉన్నారు. వారికి ఆలయం తరఫున పాలు, మంచినీళ్లు, పండ్లు అందించలేకపోయారు యంత్రాంగం. ఏటా ఇవి అందించేవారు. కానీ ఈసారి ఆలయ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ఆలయంలో వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న వారికి గర్భగుడికి సమీపంలో మూడు మండపాలు ఏర్పాటు చేశారు. రూ.100 టికెట్ తీసుకున్న వారికి గర్భగుడి బయట మండపాల్లో అక్షరాభ్యాసం చేశారు. అయితే దర్శనం కోసం వేర్వేరుగా లైన్లు లేకపోవడం ఇబ్బందులకు కారణమైంది. దీనివల్ల దర్శనం ఆలస్యమై గంటల తరబడి భక్తులు పిల్లలతో పాటు క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచ్చింది.

ఉదయం ఏడుగంటలకు క్యూలోకి వచ్చాం. మెయింటెనెన్స్ సరిగా లేదు. అందరూ ఒకేసారి ఎగబడుతున్నారు. కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం.

-భక్తులు

కదలని క్యూలైన్లు

అక్షరాభ్యాసం టికెట్ తీసుకుని మండపానికి చేరుకోవడానికి 3గంటల సమయం, అక్షరాభ్యాసం పూర్తి చేసుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకు మరో గంటన్నర సమయం పట్టిందని భక్తులు వాపోయారు. వీఐపీల సేవలో ఆలయ సిబ్బంది తరించడం వల్ల క్యూలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు దాదాపు గంట పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. వందల మందికి వీఐపీ మార్గంలో ఆలయ సిబ్బంది, పోలీసులు దర్శనం చేయించారు.

బాసర ఆలయంలో కిటకిట.. క్యూలైన్లలో భక్తుల కటకట

తమవారికే స్పెషల్ దర్శనం

కొందరు ఆలయ సిబ్బంది వెయ్యి రూపాయల టికెట్లు కౌంటర్ నుంచి కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించి వీఐపీ మార్గంలో దర్శనం చేయించారని భక్తులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఎమ్మెల్యే వరకు అంతా వీఐపీ మార్గంలో వెళ్లడంతో సాధారణ భక్తుల క్యూలైన్లు ముందుకు కదల్లేకపోయాయి. ఆలయ అధికారులే నేరుగా వీఐపీలకు దర్శనం చేయించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను పూర్తిగా విస్మరించారంటున్నారు. ప్రతి ఏటా వసంత పంచమి, నవరాత్రుల్లో భక్తుల రద్దీగా ఉంటుంది. ఇది తెలిసినా ఆలయ అధికారులు లోపాలను సరిదిద్దకపోవడం సమస్యలకు కారణమైంది. ఉత్సవాలపై సమీక్షిస్తే తప్పులు పునరావృతం కావని భక్తులు అంటున్నారు.

బాబుకు అక్షరాభ్యాసం చేయించడానికి టెంపుల్​కి వచ్చాం. వందలమందిని ఒకేసారి రమ్మంటున్నారు. టోకెన్ కోసం అందరూ ఎగబడుతున్నారు. వాళ్లు వచ్చి అక్షరాభ్యాసం చేస్తే బాగుండు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. సిస్టం సరిగా లేదు. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలో పిల్లల ఏడుపులు మారుమోగుతున్నాయి.

-భక్తులు

వర్గల్​కు భక్తుల తాకిడి..

మరోవైపు వసంత పంచమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. విద్యా జ్యోతిగా సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం వేలాదిగా వస్తున్న భక్తుల కోసం.. మూడు మండపాల్లో ఏర్పాట్లు చేశారు.

మేం ఉదయం ఏడుగంటలకు క్యూలైన్​లోకి ఎంటర్ అయ్యాం. పసిపాపతో అప్పటి నుంచి నిరీక్షిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక లైన్ సరిగా లేదు. పిల్లల కోసం ఏం ఏర్పాట్లు చేయలేదు. కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఇదివరకు పాలు, నీళ్లు, పండ్లు ఇచ్చేవారు. ఈసారి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

-భక్తులు

బాసర ఆలయంలో కిటకిట.. క్యూలైన్లలో భక్తుల కటకట

ఇదీ చూడండి:

Last Updated :Feb 5, 2022, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.