ETV Bharat / state

Kadem Project Danger Zone : ప్రమాదకరంగా కడెం జలాశయం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

author img

By

Published : Jul 22, 2023, 7:55 PM IST

Kadem Project
Kadem Project

Kadem Project Is Danger : నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాది భారీ వరదల సమయంలో ప్రమాదపు అంచుల్లోకి వెళ్లిన ఈ ప్రాజెక్టు అతికష్టం మీద బయటపడింది. ముంపులో ఉన్నంత సేపు పరుగులు తీసిన అధికార యంత్రాంగం.. గట్టెక్కాక అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఏడాది భారీ వర్షాలు, అదేస్థాయిలో వస్తున్న వరదలతో వేళ.. శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తే సమయంలో మరోసారి మొరాయించటం అధికారులతో పాటు.. స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది.

ప్రమాదకరంగా కడెం జలాశయం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

Kadem Project Is Danger Gates Jammed : గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు కడెం జలాశయం గేట్లు పూర్తిగా మొరాయించి.. అధికారులను, దిగువన ఉన్న గ్రామస్థులను భయాందోళనకు గురి చేసింది. ఇప్పుడు తాజా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. 65 ఏళ్ల క్రితం నిర్మల్‌ జిల్లాలో నిర్మించిన కడెం ప్రాజెక్టును అధికారులు నిర్లక్ష్యం వదిలేస్తున్నారు.

ఇప్పుడు ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి కడెం జలాశయం నిండుకుండలా మారింది. శుక్రవారం గేట్లు ఎత్తే సమయంలో రెండు గేట్లు మొరాయించాయి. దీంతో ఒక్కసారిగా ఏకంగా 6.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ప్రాజెక్టు ముంపునకు గురైంది. వరద గేట్లకు ఉన్న మోటార్లన్నీ నీట మునిగాయి. రెండు గేట్ల కౌంటర్‌ వెయిట్‌లు కొట్టుకుపోయాయి.

Kadem Project In Nirmal : ఏప్రాన్, స్పిల్వే, గేట్లకు మధ్యనున్న డివైడర్ గోడలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్ట్ దిగువన ఉన్న ప్రజలు రెండు రోజుల పాటు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు . అతికష్టం మీద పరిస్థితి అదుపులోకి రాగా.. అధికారయంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు పకడ్బందీగా చేయకుండా పైపై మెరుగులతో నెట్టుకొచ్చారు. వరద వచ్చాక చూద్దామనట్లుగా అధికారులు వ్యవహరించారు. దీంతో ఈ ఏడాది కూడా దిగువన ఉన్న గ్రామాల ప్రజలు ముప్పు తప్పలేదని ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కాలం గడుపుతున్నారు.

హాండిల్‌ తిప్పుతూ గేట్లు ఎత్తివేత : కడెం జలాశయానికి వరద ఉద్ధృతంగా రావడంతో అధికారులు అప్రమత్తమై.. మొత్తం 18 గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించారు. వాటిలో తొమ్మిది మాత్రమే ఎత్తగలిగారు. మిగతా తొమ్మిదింటిలో రెండింటికి కౌంటర్ వెయిట్లు బిగించని కారణంగా, మరో ఏడు సాంకేతిక సమస్యలతో ఎత్తడం ఇబ్బందికరమైంది. విద్యుత్తు మోటార్ల ద్వారా గేట్లు పైకిలేవకపోవడంతో స్థానిక యువకులు, సిబ్బంది కలిసి చేతులతో హాండిల్ తిప్పుతూ అతికష్టం మీద మూడింటిని ఎత్తగలిగారు. సాయంకాలం వరకు నిపుణుల సహాయంతో మరో రెండు గేట్లను పాక్షికంగా ఎత్తారు. 14 గేట్లద్వారా ఎగువ నుంచి వచ్చిన 1.72 లక్షల క్యూసెక్కుల వరదను అదేస్థాయిలో కిందికి వదిలారు.

kadem Project Water Level Crossed : రెండేళ్లుగా కడెం జలాశయం వరదగేట్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. గతేడాది సమస్యను అధిగమించాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణి పాటించారు. ప్రాజెక్టు సందర్శనకు మేలో వచ్చిన ఈఎన్‌సీ బృందం కౌంటర్ వెయిట్లను జూన్ 10 నాటికి బిగించాలని ఆదేశించినా.. సరైన స్పందనరాలేదు. ఏప్రాన్, స్పిల్వే, డివైడర్ వాల్స్ మరమ్మతులకు ప్రభుత్వం రూ.1కోటి 44 లక్షలను ఆలస్యంగా మంజూరు చేయడంతో టెండరు పూర్తవక పనులను చేపట్టలేదు. దెబ్బ తిన్న వరద గేట్లను, మోటార్లను స్థానిక సిబ్బందితోనే మరమ్మతు చేయించారు. ఈ నిర్లక్ష్యం కారణంగా మరోసారి గేట్లు మొరాయించాయి. తరచుగా తలెత్తుతున్న సమస్యలు, భారీ వరదల వేళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కడెం ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.