ETV Bharat / state

Integrated Markets in Narayanapet : కోట్లలో మార్కెట్ల నిర్మాణం.. కానీ అంతా వృథా..!

author img

By

Published : May 13, 2023, 3:00 PM IST

Etv Bharat
Etv Bharat

Integrated Markets in Narayanapet : ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే ఏముంది ? ఎన్ని వసతులు కల్పిస్తే ఏముంది ? జనం వాటిని సద్వినియోగం చేసుకోనప్పుడు ఎంతటి గొప్ప నిర్మాణమైనా సరే నిరుపయోగమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ల పరిస్థితి కొన్నిచోట్ల ప్రస్తుతం అలాగే ఉంది. నారాయణపేట జిల్లాలో జనవరిలో ప్రారంభమైన సమీకృత మార్కెట్ ఇప్పటికీ వ్యాపారులు, కొనుగోలు దారులు లేక వెలవెలబోతోంది. చికెన్-చేపల మార్కెట్ పరిస్థితి సైతం అలాగే ఉంది.

కూరగాయలు అమ్మేవాళ్లు, కొనేవాళ్లు లేక వెలబోతున్న మార్కెట్లు

Integrated Markets in Narayanapet : నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కూరగాయల, మాంసాహార మార్కెట్‌లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాక వెలవెలబోతున్నాయి. నారాయణ పేట బస్టాండ్ ఎదురుగా సుమారు 6 కోట్లతో సమీకృత కూరగాయల మార్కెట్‌ను నిర్మించారు. మరో కోటిన్నర ఖర్చు చేసి ప్రహరీ, ఆర్చి, సుందరీకరణ, పార్కింగ్ లాంటి పనులు చేపట్టారు. జనవరిలో మంత్రి కేటీఆర్‌ ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. 4 నెలలు గడిచినా ఇప్పటికి వ్యాపారులు, కొనుగోలుదారులు లేక సుందరంగా నిర్మించిన భవనం వెలవెలబోతుంది.

కూరగాయలు చెత్త బుట్టలో పారేస్తున్నాం : 112 దుకాణాలు ఉండగా 70 వరకూ కూరగాయలు, మరో 40వరకూ పండ్లు, పూల వ్యాపారుల కోసం కేటాయించేలా రూపకల్పన చేశారు. 10 షెటర్లున్నాయి. వీటిని టెండర్ల ద్వారా వ్యాపారులకు అప్పగించాల్సి ఉంది. కాని ఇప్పటికే కేవలం నలుగురు మాత్రమే అక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. దుకాణాలు ఎక్కువగా లేకపోవడంతో జనం అటువైపు మోగ్గు చూపట్లేదు. గిరాకీ లేక కూరగాయలు పాడై.. చెత్తబుట్ట పాలు చేస్తున్నామని అమ్మకం దారులు వాపోతున్నారు.

అన్ని సౌకర్యాలు ఉన్నా.. గిరాకీ లేదు : నారాయణపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో, వీధుల వెంట కూరగాయలు, పూలు, పండ్లు అమ్మే చిరు వ్యాపారులు మాత్రం సమీకృత మార్కెట్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పురపాలిక అధికారుల సూచన మేరకు ఒకటి రెండు రోజులు అక్కడే సరుకు అమ్మామని, గిరాకీ లేక అన్నీ పారేయాల్సి వచ్చిందంటున్నారు. పార్కింగ్, విద్యుత్, మరుగుదొడ్లు.. సహా అన్ని వసతులు ఉన్నా గిరాకీ లేని మార్కెట్ తమకెందుకన్నది వారు వాదిస్తున్నారు. ఓ వైపు రైతు బజారులో రైతులు కూరగాయలు అమ్ముతుంటే సమీకృత మార్కెట్ జనం ఎలా వస్తారన్నది మరో ప్రశ్న. జనం రద్దీ అధికంగా ఉండే కూడళ్లలో గిరాకీ వస్తుంది తప్ప మార్కెట్ వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. పట్టణంలో ఎక్కడా లేకుండా అక్కడ మాత్రమే అమ్మేలా చూస్తేనే తాము మార్కెట్‌కి వస్తామని చెబుతున్నారు.

ఖాళీగా ఉంటున్న దుకాణాలు : పట్టణంలోనే కోటీ 60లక్షలతో చికెన్, చేపల మార్కెట్‌ను నిర్మించారు. గత ఏడాది మేలో కేటీఆర్‌ ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. మొత్తం 41 దుకాణాలుండగా అందులో 10 నుంచి 15 దుకాణాల్లో మాత్రమే విక్రయాలు సాగుతున్నాయి. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. వేడిమి అధికంగా ఉండటం వల్ల కోళ్లు బతకవన్న కారణం చూపి చికెన్ అమ్మేవాళ్లు అక్కడకొచ్చేందుకు ఆసక్తి చూపట్లేదు. దీంతో వారికి కేటాయించాల్సిన దుకాణాల్ని మటన్ వ్యాపారులకు కేటాయించారు. ముగ్గురు చేపల అమ్మకం దారులున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దృష్టి సారించి ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

"సమీకృత కూరగాయల మార్కెట్‌లో కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అవి పూర్తికాగానే 15 రోజుల్లో వీధి వ్యాపారులను మార్కెట్‌కి తరలిస్తాం. పట్టణ వీధుల్లో పూలు, పండ్లు, కూరగాయలమ్మే వారికి ఇప్పటికే దుకాణాలు కేటాయించాం. పనులు పూర్తి కాగానే సమీకృత కూరగాయల మార్కెట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తాం."- సునీత, నారాయణపేట జిల్లా మున్సిపల్ కమిషనర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.