ETV Bharat / state

Chalo Rajbhavan: చలో రాజ్​భవన్​కు నిరసన సెగ.. రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల నిర్బంధం.!

author img

By

Published : Jul 16, 2021, 1:02 PM IST

Updated : Jul 16, 2021, 1:24 PM IST

చమురు ధరల​ పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ పిలుపు మేరకు రాజ్​భవన్​ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.

chalo rajbhavan
చలో రాజ్​భవన్​

పెట్రోల్, డీజిల్​, వంటగ్యాస్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్​ భవన్​కు నిరసన సెగ తగులుతోంది. రాజ్​ భవన్​ ముట్టడికి రాష్ట్రం నలుమూలల నుంచి బయలుదేరిన కాంగ్రెస్​ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని ఇళ్ల వద్దనే హౌస్​ అరెస్టులు, అరెస్టులు చేస్తున్నారు.

రాజధానిలో

హైదరాబాద్​లో జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు టి.రామ్​మోహన్​ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసారు. మేడ్చల్​లో మండల యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు రేగు రాజును ముందస్తుగానే పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు. రాజ్​భవన్​కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ధర్నా చౌక్​ వద్ద నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చని గతంలోనే హైకోర్టు అనుమతిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడంపై రామ్​మోహన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోదాడలో

రాజ్​భవన్​ ముట్టడికి సూర్యాపేట జిల్లా నుంచి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్​ నాయకులను కోదాడ పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. పెంచిన చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులను రాజ్ భవన్​కు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు.

మిర్యాలగూడలో

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రాజ్​భవన్​ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ శంకర్ నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పెట్రో ధరలు తగ్గించే వరకు సామాన్యుల పక్షాన కాంగ్రెస్​ పోరాడుతూనే ఉంటుందని వెల్లడించారు. ఇదీ చదవండి: Chalo Raj bhavan: ఎక్కడికక్కడ ముళ్లకంచెలు.. రాజ్​భవన్​ గేటుకు కాంగ్రెస్​ జెండాలు!

సిద్దిపేటలో

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు కరోనా మహమ్మారి వల్ల ఉపాధి లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యులకు.. పెరిగిన నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారాయని హుస్నాబాద్​ కాంగ్రెస్​ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్​ ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించే వరకు పార్టీ తరఫున పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.

రాజ్​భవన్​ ముట్టడికి బయలుదేరేందుకు యత్నించిన పూడూరు వర్కింగ్​ ప్రెసిడెంట్​ భాస్కర్​ ఇంటి వద్ద.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టులు, అక్రమాలు ఉద్యమాలను ఆపలేనని భాస్కర్​ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​ నిరంకుశ పాలనకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Revanth Reddy: 'ఎంతమందిని అరెస్టు చేసినా ర్యాలీ చేసి తీరతాం'

Last Updated : Jul 16, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.