ETV Bharat / state

ఉమ్మడి జిల్లాలో ఎక్కడి మిషన్​ భగీరథ పనులు అక్కడే!

author img

By

Published : Sep 7, 2020, 11:36 AM IST

mission bhagiratha works delayed in joint nalgonda district
ఉమ్మడి జిల్లాలో ఎక్కడి మిషన్​ భగీరథ పనులు అక్కడే!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిషన్​ భగీరథ పనులు నాలుగేళ్లుగా సాగుతున్నాయి. వేగం పెంచాలని సమీక్షల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు వేగాన్ని అందుకోవడం లేదు. వివిధ గ్రామాల్లో గొట్టపుమార్గాల కోసం సీసీరోడ్లు, మురుకాల్వలను ధ్వంసం చేశారు. వాటి పునర్నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.

మిషన్‌ భగీరథ పనులు నాలుగున్నరేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంకుల అనుసంధానం, అంతర్గత గొట్టపు మార్గాల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో నకిరేకల్‌ నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఇప్పటి వరకు 30 శాతం గ్రామాలకు మాత్రమే పూర్తిస్థాయిలో భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. పనుల్లో వెనుకబడి ఉన్నారని, వేగం పెంచాలని సమీక్షల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు వేగాన్ని అందుకోవడం లేదు. వివిధ గ్రామాల్లో గొట్టపుమార్గాల కోసం సీసీరోడ్లు, మురుకాల్వలను ధ్వంసం చేశారు. వాటి పునర్నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు భగీరథ నీరిస్తున్నారు.

సామగ్రి మాయం కేసు ఏమైంది..?

నకిరేకల్‌ నియోజకవర్గంలో భగీరథ పనుల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.70 లక్షల విలువైన గేట్‌వాల్వులు మాయమయ్యాయి. అయిటిపాములలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్లాంట్‌లో నిల్వచేసిన ఇవి చోరీకి గురయ్యాయి. ఏడాదిన్నరగా ఈ కేసు కొలిక్కిరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసినా సామగ్రి జాడలేదు. సామగ్రి, నిందితుల ఆచూకీ లభించడం లేదని పోలీసు కేసును మూసేసే దశలో ఉంది. రూ.లక్షల విలువైన సామగ్రి మాయంపై శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. భారీస్థాయిలో సామగ్రి మాయం కావడం కూడా భగీరథ పనుల్లో నియోజకవర్గం వెనుకబడేందుకు కారణం.

మిషన్‌ భగీరథలో నాసిరకం యంత్రాలు అమర్చడం వల్ల నీటి సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి, నా సొంత గ్రామానికి కూడా భగీరథ తాగునీరు రావడంలేదు, నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి, అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదు.

- ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

మిషన్‌ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నకిరేకల్‌లో ప్రధాన గొట్టపుమార్గం నిర్మించాల్సి ఉంది. త్వరలో ఈ పనులు చేపట్టి అన్ని ట్యాంకులకు నీటిని అందిస్తాం. నకిరేకల్‌లో ప్రస్తుతం ఉన్న పాతగొట్టపు మార్గాల ద్వారానే ఇళ్లల్లో ఉన్న నల్లాలకు భగీరథ నీటిని సరఫరా చేస్తాం. దశల వారీగా నల్లాలకు ఫ్లోకంట్రోల్‌ వాల్వులు అమర్చి సరఫరాను క్రమబద్ధీకరిస్తాం. సామగ్రి చోరీ కేసు ఇంకా తేలలేదు. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉన్నతాధికారులు తీసుకుంటారు.

- ఎ.నర్సింహ, డీఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉప డివిజన్‌, నకిరేకల్‌

నకిరేకల్‌లోని శివాజీనగర్‌, డాక్టర్స్‌ కాలనీ ప్రాంతాలకు భగీరథ నీటిని అందించేందుకు రూ.25 లక్షలతో గ్రామీణ నీటిసరఫరా విభాగం డీఈఈ కార్యాలయం ఆవరణలో ఈ ట్యాంకు నిర్మించారు. రెండేళ్ల నుంచి ఇది నిరుపయోగంగా ఉంటోంది. దీనితోపాటు నకిరేకల్‌లో మరో 12 కొత్త ట్యాంకులు నిర్మించారు. అవన్నీ ఇలాగే ఉన్నాయి. వీటికి నీటిని అందించే ప్రధాన గొట్టపుమార్గం పనులు మొదలుకాలేదు. నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పనుల తీరుకు ఇది నిదర్శనం.

ఉప డివిజన్‌లో భగీరథ పనులు తీరిది..

గ్రామీణ నీటి సరఫరా విభాగం నకిరేకల్‌ ఉప డివిజన్‌లో నకిరేకల్‌, కేతేపల్లి, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండలాలున్నాయి.

  • మొత్తం ఆవాసాలు: 245
  • వీటి పరిధిలో ఇళ్ల నల్లా కనెక్షన్లు: 73,164
  • పాత ఓవర్‌హెడ్‌ ట్యాంకులు: 198
  • నీరందిస్తున్న పాత ట్యాంకులు: 146
  • నిర్మించిన భగీరథ ఓవర్‌హెడ్‌ ట్యాంకులు: 239
  • నీటిని నింపుతున్న భగీరథ ట్యాంకులు: 125
  • నిరుపయోగంగా ఉన్న ట్యాంకులు: 114

ఇదీ చూడండి: అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.