ETV Bharat / state

NagarjunaSagar: సాయంత్రం తెరుచుకోనున్న నాగార్జునసాగర్ గేట్లు...

author img

By

Published : Aug 1, 2021, 8:56 AM IST

Updated : Aug 1, 2021, 1:58 PM IST

nagarjunasagar
నాగార్జునసాగర్​

కృష్ణా పరివాహకంలో భారీ వరదల కారణంగా... జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కానీ ఏటా ఆగస్టు రెండో వారం తర్వాత గేట్లు ఎత్తే సంస్కృతికి భిన్నంగా ఈసారి... ఆగస్టు 1 నాడే నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. నాగార్జునసాగర్​కు వస్తున్న భారీ ఇన్ ఫ్లో వల్ల... ఇవాళ సాయంత్రం తర్వాత క్రస్ట్​ గేట్లు ఎత్తబోతున్నారు. మరోవైపు ప్రణాళికకు భిన్నంగా ఈ సీజన్లో ముందస్తు సమాలోచనలు లేకుండానే ఏకంగా... ఎడమ కాల్వకు నీళ్లు వదులుతున్నారు.

NagarjunaSagar: సాయంత్రం తెరుచుకోనున్న నాగార్జునసాగర్ గేట్లు...

కృష్ణానదికి వస్తున్న వరదలతోపాటు తుంగభద్ర నీరు తోడైన వేళ... శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. అక్కడ గేట్లు ఎత్తటంతో నాగార్జునసాగర్ నాలుగైదు రోజుల్లోనే జలకళతో తొణికిసలాడుతోంది. అయితే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఏటా క్రస్ట్​ గేట్లను ఆగస్టు రెండో వారం లేదా ఆ తర్వాతి వారాల్లో ఎత్తుతారు. కానీ ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఆగస్టు తొలిరోజు నాడే నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్​కు ఇన్ ఫ్లో ఈ సీజన్లో జులై 28న మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం లక్షా 26 వేల క్యూసెక్కులతో మొదలైన వరద... ఇవాళ ఉదయం అత్యధికంగా 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఈ ఇన్ ఫ్లోనే అత్యధికం కాగా... జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. గత నెల 28న 190 టీఎంసీలతో ఉన్న ప్రాజెక్టుకు... ఈ నాలుగు రోజుల్లోనే మరో వంద టీఎంసీలు వచ్చి చేరింది. 312.04 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను ప్రస్తుతం 290.22 టీఎంసీలు... 590 అడుగుల పూర్తిస్థాయి నిల్వకు గాను 582.5 అడుగుల మేర నీరుంది. కృష్ణాకు వస్తున్న ప్రవాహం కారణంగా సాగర్​లో రోజుకు ఏడు అడుగులకు పైగానే నీరు చేరింది. దీంతో నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఎడమ కాల్వకు నీటి విడుదల

ఇవాళ సాయంత్రానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు... పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. సాయంత్రం తర్వాత గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎడమ కాల్వకు నీటిని వదలాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో క్రస్టుగేట్ల కన్నా ముందుగానే ఈరోజు మధ్యాహ్నం ఎడమ కాల్వతోపాటు... ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఏఎమ్మార్పీ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. గతేడాది ఎడమ కాల్వకు వదిలిన రెండ్రోజుల తర్వాతే... క్రస్ట్ గేట్లు ఎత్తారు. ఈసారి అందుకు భిన్నంగా రెండూ ఒకేరోజు చేపడుతున్నారు. ఎడమ కాల్వకు విడుదల చేసేముందు ఎన్నెస్పీ అధికారులు ప్రణాళిక రూపొందిస్తారు.

ఎడమ కాల్వకు 35 టీఎంసీల వినియోగం

వారబందీ లెక్కన ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఏటా నీటి విడుదల కొనసాగించేవారు. కొన్నేళ్ల క్రితం వరకు వారం రోజులు విడుదల, వారం నిలిపివేత అన్న విధంగా ఉండేది. కానీ చివరి భూములకు నీరందకపోవడంతో... నీటి విడుదలను మరో రెండ్రోజులు అదనంగా పొడిగించి వారం నుంచి తొమ్మిది రోజులకు పెంచారు. అటు నిలిపివేతను ఆరు రోజులకు కుదించారు. ఈ లెక్కన ఆగస్టు మూడో వారం నుంచి డిసెంబరు మూడో వారం వరకు కాల్వలకు నీరు విడుదలవుతుంటుంది. సాగర్ ఆయకట్టుదారులకు ప్రతి ఖరీఫ్​లో... ఏడు తడుల పాటు నీరందుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 2 లక్షల 98 వేల ఎకరాలు ఎడమ కాల్వ నీటితో... మరో 70 వేల ఎకరాలు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగవుతోంది. ఎడమ కాల్వ కింద పంటలకు గాను ఖరీఫ్​లో... 35 టీఎంసీలు వినియోగమవుతాయి. ఈ మేరకు సాగర్​లో నీటి నిల్వను దృష్టిలో ఉంచుకుని వదలటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ముందుగానే వచ్చిన వరదలతో... సంప్రదాయాలకు భిన్నంగా నీటిని ముందే విడుదల చేయాల్సి వస్తోంది.

ఇదీ చదవండి: Lal Darwaza Bonalu: వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

Last Updated :Aug 1, 2021, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.