ETV Bharat / state

కరోనా ప్రభావమున్నా.. అధిగమించిన రైతన్న

author img

By

Published : Sep 29, 2020, 7:43 AM IST

Farmers have been successful in cultivation despite the corona effect in telangana
కరోనా ప్రభావమున్నా.. అధిగమించిన రైతన్న

ఎన్నో వ్యాపారాలు మూతపడ్డాయి.. ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధి కరవైంది.. వలస కార్మికులు రోడ్డుపాలయ్యారు.. కరోనా సృష్టించిన విలయంలో దాదాపు అన్ని రంగాలూ ప్రభావితమయ్యాయి.. అయితే, ఇంతటి సంక్షోభ సమయంలోనూ అన్నదాతలు ముందుకు ‘సాగు’తూనే ఉన్నారు. కొవిడ్‌ ప్రభావంతో ఎదురైన సమస్యల్ని అధిగమించి, వ్యయప్రయాసలకోర్చి రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో పంటలు సాగుచేసి చూపించారు.

వ్యవసాయ పనుల్లో పరస్పర సహకారం, యంత్రాల వినియోగం, కుటుంబ సభ్యులంతా పనులు చేసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలతో రైతన్నలు కరోనా సమయంలోనూ విజయవంతంగా ముందుకెళ్లడంతో సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగింది. ఉపాధి కోల్పోయి కొందరు, వర్క్‌ ఫ్రం హోమ్‌తో మరికొందరు విద్యావంతులు, యువత పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లి తమ కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలవడంతో పంటపొలాలు కొత్తకళను సంతరించుకున్నాయి. గత యాసంగి(రబీ) సీజన్‌ చివరిదశ(మార్చి)లో మొదలైన కరోనా సంక్షోభం ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో పల్లెలకు పాకి మరింత తీవ్రమైనా రైతులు వెనుకంజవేయలేదు. సమస్యల్ని దాటుకొని పంటల సాగులో సఫలీకృతమయ్యారు.

పంటలసాగులో రికార్డు..

వానాకాలం పంటల సాగు పనులు ముమ్మరమైన జూన్‌, జులై, ఆగస్టు నెలల్లోనే కరోనా కేసులు పల్లెల్లోనూ బాగా పెరిగాయి. అయినా రైతు కుటుంబాలు కొవిడ్‌కు వెరవకుండా ముందుకు సాగడంతో రికార్డుస్థాయిలో పంటల విస్తీర్ణం కోటీ 33 లక్షలకు చేరింది. ఇవి గాక కూరగాయలు, పండ్లు, పసుపు, మిరప, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు మరో 9.72 లక్షల ఎకరాల్లో వేశారు. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం ఇదే మొదటిసారని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

కరోనాతో ఎదురైన సమస్యలు..

  • వైరస్‌ పల్లెల్లోకి చేరి పాజిటివ్‌ కేసులు పెరిగేకొద్దీ వ్యవసాయ పనులకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.
  • గతంలో దూరప్రాంతాల్లో పనులకు కూలీలు గుంపులుగా ట్రాక్టర్లలో వెళ్లేవారు. ఈ సారి కొవిడ్‌ నేపథ్యంలో చిన్నిచిన్న వాహనాలు సమకూర్చాల్సి రావడంతో వ్యయం పెరిగిందని మెదక్‌ జిల్లాకు చెందిన రైతు రాజయ్య చెప్పారు.
  • ప్రస్తుతం సాగులో ఉన్న 1.33 కోట్ల ఎకరాల పంటల కోతలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. రికార్డుస్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగినందున కోతలు ముమ్మరమైన దశలో కూలీలు దొరకడం, మార్కెట్లకు పంటలు తరలించడం సవాల్‌గా మారనుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
  • రాష్ట్రంలో వరి కోత యంత్రాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. కానీ, దూది తీసే యంత్రాలు ఎక్కడా లేవు. ఈ పనులకు లక్షల సంఖ్యలో కూలీలు అవసరం.
  • సాగు ఆరంభంలో లాక్‌డౌన్‌తో దుకాణాలు మూసేయడం, పట్టణాల నుంచి పల్లెలకు రాకపోకలు సరిగా లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

మహారాష్ట్ర నుంచి కూలీలు రాకున్నా..

- గోవర్ధన్‌యాదవ్‌, ధనోరా గ్రామం, ఆదిలాబాద్‌ జిల్లా


కొవిడ్‌ సంక్షోభంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూలీలు రావడం బాగా తగ్గింది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌, మంచిర్యాల తదితర సరిహద్దు జిల్లాలకు ప్రతి సీజన్‌లో పెద్దసంఖ్యలో కూలీలు రావడం ఆనవాయితీ. ఈ సీజన్‌లో వారు కరోనాకు భయపడి రాకపోవడంతో వ్యవసాయ పనుల్లో కొంత జాప్యం జరిగింది. అయినా స్థానికంగా కూలీలను సర్దుబాటు చేసుకుని పసుపు 3 ఎకరాల్లో, అల్లం 2, మిరప 2, సోయా 6, పత్తి 40 ఎకరాల్లో వేశాం.- గోవర్ధన్‌యాదవ్‌, ధనోరా గ్రామం, ఆదిలాబాద్‌ జిల్లా

దుకాణాలు మూయడంతో ఇబ్బందులు

- వెలుగు యాదయ్య, గుర్రంపోడు, నల్గొండ జిల్లా


వ్యవసాయ పనులు ప్రారంభమైన సమయంలో లాక్‌డౌన్‌ వల్ల దుకాణాలు లేక, బయట తిరగలేక ఇబ్బంది పడ్డాం. లాక్‌డౌన్‌ పేరు చెప్పి దుకాణాలు సరిగా తెరవక, ఒకవేళ తెరిచినా ధరలు పెంచి అమ్మారు. అయినా, ఎలాగోలా అవసరమైనవన్నీ కొని, కూలీల కొరతను అధిగమించి పంటలు సాగుచేశాం. గిట్టుబాటు ధర వస్తే అదే పదివేలు.- వెలుగు యాదయ్య, గుర్రంపోడు, నల్గొండ జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.