ETV Bharat / state

ప్లాస్టిక్​ రహిత ములుగే లక్ష్యంగా..

author img

By

Published : Oct 30, 2019, 10:52 PM IST

గిరిపుత్రుల జిల్లాగా పేరుగాంచిన ములుగులో వెలుగులు నింపేందుకు అధికార యంత్రాంగం నడుం కట్టింది. ప్లాస్టిక్​ భూతాన్ని పారదోలేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు నడుస్తోంది. ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెంచుతోంది. కిలో ప్లాస్టిక్​కు కిలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సైతం చకచకా సాగుతోంది. ప్లాస్టిక్​ రహిత జిల్లాగా రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ప్లాస్టిక్​ రహిత మేడారం జాతర నిర్వహణకు కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది.

ప్లాస్టిక్​ రహిత ములుగే లక్ష్యంగా..

ప్లాస్టిక్​ రహిత ములుగే లక్ష్యంగా..

మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న ప్లాస్టిక్​ నిషేధం ములుగు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతోంది. ఉన్నతాధికారి నుంచి.. క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు.. విద్యావంతుల నుంచి బడికి వెళ్లే పిల్లల వరకు ములుగు జిల్లాను ప్లాస్టిక్​ రహితంగా మార్చేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి పక్కా ప్రణాళికతో ప్లాస్టిక్​ను తిరిగి వెనక్కి తీసుకురావడంతో పాటు ఇప్పటి నుంచి ఒక్క సంచి బయటకు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 174 పంచాయతీల్లో ఈనెల 16 నుంచి 26 వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కిలో ప్లాస్టిక్​కు కిలో సన్న బియ్యాన్ని ఇచ్చారు. ఫలితంగా 44 వేల కిలోలు సేకరించారు. అంతేకాక ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దర్జీలను అందుబాటులో ఉంచి గుడ్డ సంచులను తయారు చేసి ఇస్తున్నారు. ఇలా 40 వేల సంచులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ములుగు జిల్లాను ప్లాస్టిక్​ రహిత జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ కంకణం కట్టుకున్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్​ను వినియోగించకుండా గట్టి చర్యలు చేపట్టారు. స్వయం సహాయక బృందాలతో కాగితం, వస్త్ర సంచుల తయారీ యూనిట్​ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.

చినుకు చినుకు కలిస్తే జడివానగా మారినట్లు ప్లాస్టిక్​ నివారణపై చేయి చేయి కలిస్తే.. ములుగు ప్లాస్టిక్​ రహిత జిల్లాగా మారే రోజు మరెంతో దూరంలో లేదనిపిస్తోంది.

ఇవీచూడండి: ' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా '

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.