ETV Bharat / state

దేవతల ఆగమనం... అట్టహాసంగా మహాజాతర ప్రారంభం

author img

By

Published : Feb 6, 2020, 5:58 AM IST

Updated : Feb 6, 2020, 7:21 AM IST

సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాకతో... మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. సారలమ్మను తీసుకొచ్చేప్పుడు... భక్తుల జయజయధ్వానాలు మిన్నంటాయి. జంపన్నవాగు పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. వనదేవతలు...వనం వీడి జనం మధ్యకు వచ్చి... జననీరాజనాలు అందుకున్నారు.

దేవతల ఆగమనం... అట్టాహసంగా మహాజాతర ప్రారంభం
దేవతల ఆగమనం... అట్టాహసంగా మహాజాతర ప్రారంభం

గద్దెలపైకి వనదేవతల చేరికతో మేడారం మహాజాతరలో తొలి అంకం ఘనంగా జరిగింది. నాలుగు రోజులు పాటు వైభవంగా జరిగే ఉత్సవాల్లో... మొదటి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై ప్రతిష్టించడమే. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగుండ్ల నుంచి మంగళవారం బయలుదేరి... 66 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం రాత్రి పగిడిద్దరాజు చేరుకున్నారు. ఏటూరినాగారం మండలం కొండాయ్ నుంచి 23 కిలోమీటర్లు ప్రయాణించి గోవిందరాజు మేడారానికి వచ్చారు.

అంతకుముందు కన్నెపల్లిలో... పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం... ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగింది. పుట్టమన్నుతో ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రదాయ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఊరేగింపుగా సారలమ్మను మేడారానికి తీసుకువెళ్లారు.

జనంతో కిటకిట

మేడారానికి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారాయి. జంపన్నవాగు పరిసరాలు... జనంతో కిటకిటలాడాయి. రహదారిపైనే చాలాసేపు నిరీక్షించిన భక్తుల్లో... సారలమ్మ రాక భక్తిపారవశ్యాన్ని నింపింది. డప్పు శబ్ధాలు, డోలు వాద్యాల నడుమ... జంపన్నవాగు మీదుగా గద్దెల వద్దకు సారలమ్మ చేరుకుంది.

సారలమ్మ మేడారానికి వచ్చినప్పటికీ... గద్దెలకు చేరుకోవడానికి ఆలస్యమైంది. దేవతలంతా వస్తున్నారని ప్రకటించి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. కానీ దేవతల ఆలస్యంతో... యాథావిథిగా దర్శనానికి అనుమతించారు. దేవతలు వచ్చాక... ప్రధాన ద్వారాలు మూసివేసి దర్శనాలు నిలిపి గద్దెలపై ప్రతిష్ఠించారు.

ప్రముఖుల రాక

మేడారానికి సమ్మక్క సారలమ్మ జాతరకు వీఐపీల తాకిడి ఇక పెరగనుంది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వనదేవతలను దర్శించుకోనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్... ఇవాళ జాతరకు విచ్చేస్తున్నారు.

దేవతల ఆగమనం... అట్టాహసంగా మహాజాతర ప్రారంభం

ఇవీచూడండి: మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్​

Last Updated : Feb 6, 2020, 7:21 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.