ETV Bharat / state

Medaram Jatara 2022: సమ్మక్క ఇవేం రోడ్లక్క.. మా మొర నీవైనా ఆలకించు సారక్క!

author img

By

Published : Oct 18, 2021, 1:53 PM IST

Medaram Jatara 2022
మేడారం ప్రధాన రహదారులు

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహాజాతర సమీపిస్తోంది. జాతర వచ్చిందంటే ఊరు, వాడ, పట్టణం, బస్తీ ఇలా అన్ని రహదారులు మేడారం వైపే సాగుతుంటాయి. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మేడారం రహదారులు వేలాది వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. ఏమాత్రం ట్రాఫిక్ అదుపుతప్పిన కష్టమే. ఆ సమయంలో రహదారులు సరిగా ఉంటేనే ఇలాంటి పెద్ద జాతరలు విజయవంతం అవుతాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. కానీ ఈసారి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రతి రెండేళ్లకు ఒకసారి తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతర వచ్చేఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. అక్కడ కొలువైన సమ్మక్క, సారలమ్మ దర్శనానికి.. కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. అయితే మేడారం వెళ్లే ప్రధాన రహదారులు మరింత అధ్వానంగా తయారయ్యాయి.

ఎక్కడ చూసినా గుంతలు పడి, చెదిరిపోయి, అస్తవ్యస్థంగా మారాయి. పట్టు తప్పితే ఎక్కడ ప్రాణాలు గల్లంతు అవుతాయోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మేడారం వెళ్లేందుకు భక్తులు ప్రధానంగా పస్రా-మేడారం, చిన్నబోయినపల్లి మేడారం, భూపాలపల్లి మేడారం, కాటారం మేడారం, తాడ్వాయి మేడారం.. ఉపయోగిస్తారు. కానీ ఈ రహదారులే మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని చోట్ల రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

పస్రా-మేడారం

ఈ రహదారిని జాతర సమయంలో ప్రైవేటు వాహనాలు వెళ్లేందుకు వినియోగిస్తారు. గతంలో ఇటువైపు ఇసుక లారీలు నడవడంతో ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. మేడారం సమీపంలో 200 మీటర్ల వరకు రహదారి పూర్తిగా కోతకు గురైంది.

తాడ్వాయి-మేడారం

14 కిలోమీటర్ల ఈ రహదారిని జాతర సమయంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీల కోసం వినియోగిస్తారు. ఈ మార్గంలో రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు.

కాటారం-మేడారం

ఈ రహదారి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతర సమయంలో కరీంనగర్​, ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు మేడారం వచ్చేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తారు. ఈ దారిలో కాటారం సమీపంలోని మాంటిస్సోరి స్కూల్ పక్కనే పెద్ద గుంత ఏర్పడింది. సుబ్బక్కపల్లి సమీపంలో మిషన్ భగీరథ పైపులు అమర్చే సందర్భంగా రహదారిని తవ్వడంతో కందకాలు ఏర్పడ్డాయి. కొర్లకుంటలో సైతం పలుచోట్ల మరమ్మతులకు గురైంది. యామన్ పల్లిలో చెరువు మధ్య నుంచి రహదారి వెళుతుంది. కానీ దారికి ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదభరితంగా మారింది. సింగారం-కాల్వపల్లి మధ్యన సైతం అక్కడక్కడ గుంతలు అయ్యాయి.

భూపాలపల్లి-మేడారం

55 కిలోమీటర్లు ఉంటుంది. జాతర సమయంలో ప్రైవేటు వాహనాలు అన్ని భూపాలపల్లి రహదారి గుండానే తిరుగుముఖం పడుతాయి. ఈ దారిలోనూ గుంతలేర్పడ్డాయి. పలుచోట్ల చెట్లు రోడ్లమీదకు వంగి ప్రమాదకరంగా ఉన్నాయి. గొల్ల బుద్ధారం సమీపంలో రహదారి ఛిద్రమైంది.

చిన్నబోయినపల్లి-మేడారం

ఈ రహదారి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాల రాకపోకలకు దీనిని వినియోగిస్తారు. చిన్నబోయినపల్లి సమీపంలో రహదారి గుంతల మయమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు షాపల్లి వద్ద పెద్దవాగు వంతెన కొట్టుకుపోయింది.

భూపాలపల్లి పరకాల 353సీ జాతీయ రహదారి కూడా మరమ్మతులకు గురైంది. గణపురం-జంగాలపల్లి, భద్రాచలం-జగన్నాథపురం రహదారులకు కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. జాతరకు ఇంకా కేవలం నాలుగు నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన రహదారులను నిర్మించాల్సి ఉంది. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తైతేనే ఎటువంటి ప్రమాదాల కాకుండా... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇదీ చూడండి: రామప్పను ప్రపంచం గుర్తించింది... మేడారం జాతరను కేంద్రం గుర్తించలేదా..?

medaram jatara 2022: 5 నెలలే గడువు.. విడుదలకాని నిధులు

వచ్చే ఏడాది మేడారం జాతర తేదీలు ఖరారు

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరపై సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.