రామప్పను ప్రపంచం గుర్తించింది... మేడారం జాతరను కేంద్రం గుర్తించలేదా..?

author img

By

Published : Aug 2, 2021, 9:08 PM IST

medaram

ఆదివాసీ ఆరాధ్యదేవతలైన సమ్మక్క-సారలమ్మల జాతరకు భక్తులు పోటెత్తడం తెలిసినదే. సర్కారు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి జాతర నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో వనదేవతల దర్శనానికి దేశవ్యాప్తంగా కోట్లసంఖ్యలో తరలివస్తారు. జాతరను ఎంత ఘనంగా నిర్వహిస్తున్నా ఈ వేడుకకు జాతీయ గుర్తింపు రాకపోవడం కొరతగానే మిగిలిపోయింది. రామప్పకు యూనెస్కో గుర్తింపు దక్కడంతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

రామప్పను ప్రపంచం గుర్తించింది... మేడారం జాతరను కేంద్రం గుర్తించలేదా..?

రెండేళ్లకోసారి జరిగే జాతర. వనమంతా జనమై.. మనసంతా వనమై.. వనదేవత దర్శనానికి పోటెత్తిన భక్తజన సందోహంతో వైభవంగా జరిగే వేడుక మేడారం జాతర. జన జాతరగా పేరొందిన మేడార సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరలు వస్తున్నాయ్ పోతున్నాయ్ తప్ప.. జాతీయ పండుగ గుర్తింపు మాత్రం దక్కట్లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైతోంది. ఎక్కడో ప్యారిస్​లో ఉన్న యునెస్కో కార్యాలయం... మన కాకతీయ శిల్ప వైభవాన్ని గుర్తించి.. రామప్పకు అరుదైన గౌరవం అందించినప్పుడు... మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

భక్తులు పెరుగుతున్నా... గుర్తింపు రాదే..

ఆదివాసీ సంప్రదాయలకు.... నెలవైన మేడారం జాతరకు ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతోంది. మహా జాతర జరిగే నాలుగు రోజులు వనమంతా... జన సంద్రంగా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, ఝార్ఘండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలివస్తారు. వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర ఘనంగా జరిపేందుకు పూజరులు ఇప్పటికే తేదీలు నిర్ణయించారు.

చిన్నచూపు తగదు..

మహా జాతర సమీపిస్తున్న ఈ సమయంలో... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరపై చిన్న చూపు తగదని... కేంద్రం తక్షణమే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని స్ధానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

ఎప్పటికి నెరవేరేనో..

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారం జాతరకు 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. నాటి నుంచీ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు జాతర నిర్వహణను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత... జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.... కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం షెడ్లు ఏర్పాటు చేసి...అడవిలో సదుపాయాలు కల్పించింది. మహా జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలంటూ రాష్ట్రం నుంచి అనేకసార్లు ప్రతిపాదనలూ వెళ్లినా ఫలితం మాత్రం కనిపించట్లేదు. జాతీయ పండుగగా గుర్తించేందుకు రెండేళ్ల క్రితమే కేంద్రం నుంచి ఓ బృందం వస్తుందని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. రామప్ప వైభవం విశ్వవ్యాప్తమైనట్లే... కోటి మందికిపైగా వచ్చే జనజాతరకు జాతీయ పండుగ గుర్తింపు దక్కితే జాతర ఖ్యాతి దేశ వ్యాప్తమవుతుంది.

ఇదీ చూడండి: వచ్చే ఏడాది మేడారం జాతర తేదీలు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.