ETV Bharat / state

KTR: 'ఎవరెన్ని మాట్లాడినా... పనిచేసే పార్టీకే ప్రజల పట్టం'

author img

By

Published : Jul 12, 2021, 6:57 PM IST

KTR
కేటీఆర్

మేడ్చల్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర విస్తీర్ణం పెరుగుతున్నందున.. బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) పేర్కొన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిని సీఎం కేసీఆర్ (Cm Kcr) ఇప్పటికే ఆదేశించారని కేటీఆర్ తెలిపారు.

జవహర్ నగర్ కార్పొరేషన్​కు రాజకీయాలకతీతంగా ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్​నగర్​లో నలుగురు కార్పొరేటర్లు, ఘట్​కేసర్, తూంకుంట మున్సిపాలిటీల్లో ముగ్గురు కౌన్సిలర్లు, ఆలియాబాద్, పొన్నాల్, అలియాబాద్ ఎంపీటీసీలు తెలంగాణ భవన్​లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరారు. పదవులు రాగానే కొందరు కోతికి కొబ్బరికాయ దొరికినట్లు వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ ముందు అవన్నీ హన్మంతుడి ముందు కుప్పిగంతుల వంటివేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఎవరెన్ని మాట్లాడినా.. కుసంస్కారంగా ప్రవర్తించినా.. ప్రజలు పనిచేసే నాయకుడికి... పార్టీకి అండగా ఉంటారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ముందు నుంచి తెరాసకు మద్దతుగా నిలుస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్, భాజపాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. ప్రాధాన్య రాష్ట్రం కాదన్నారు. తెరాసకు మాత్రం మొదటి, చివరి, ఏకైక ప్రాధాన్యత తెలంగాణేనన్నారు.

కృష్ణా జలాల వంటి అంశాల్లో కాంగ్రెస్, భాజపాలు తెలంగాణలో ఒక తీరు... పక్క రాష్ట్రంలో మరోతీరు మాట్లాడుతాయని.. తెరాస మాత్రమే ఎవరితోనైనా పోరాడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్, భాజపాలకు తెలంగాణ అనేది దేశంలో ఉండే 28 రాష్ట్రాల్లో ఇది ఒకటి. వాళ్లకు ఇది ప్రయార్టీ కాదు. కానీ తెరాసకు మొదటి ప్రయార్టీ... ఆఖరి ప్రయార్టీ తెలంగాణ మాత్రమే. కృష్ణా జలాల వివాదంలో ఎవరితోనైనా పోరాడేది ఒక్క తెరాసనే. కాంగ్రెస్, భాజపా నాయకులు ఇక్కడ ఒకతీరుగా... ఏపీలో మరోలా మాట్లాడుతారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెగించి కోట్లాడే ఒకే ఒక్క పార్టీ తెరాస. పార్టీలో చేరిన మిత్రులందరికీ స్వాగతం.

-- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

KTR: 'ఎవరెన్ని మాట్లాడినా... పనిచేసే పార్టీకే ప్రజలు పట్టం కడతారు'

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.