ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో భారీ వర్షం.. రహదారులు జలమయం

author img

By

Published : Jul 23, 2020, 9:58 AM IST

heavy-rain-in-hyderabad-city
రాజధానిలో భారీ వర్షం.. జలమయమైన వీధులు, రహదారులు

ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయం కాగా.. మరికొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్​ నగరంతో పాటు మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లలోకి నీరు..

ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాధిగూడ, ఘట్​కేసర్, పోచారం ప్రాంతాల్లో వీధుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. బోడుప్పల్, పీర్జాధిగూడ నగర పాలక సంస్థలు, పోచారం, ఘట్​కేసర్ మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..

మారేడ్‌పల్లి, లింగంపల్లి, మియాపూర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట్‌, బేగంపేట, ఉప్పల్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, జీడిమెట్ల, మల్కాజిగిరి, సుచిత్ర, జగద్గిరిగుట్ట, దుండిగల్, కొంపల్లి, సూరారం, రాజేంద్రనగర్, గండిపేట, కిస్మత్​పూర్​, శంషాబాద్, అత్తాపూర్, శివరంపల్లి తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. మల్కాజిగిరి, నేరేడ్​మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, చర్లపల్లి, నాగారం. కూకట్‌పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బోయిన్​పల్లి, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

రోడ్లపై వాననీటితో ఉద్యోగుల అవస్థలు

హైదరాబాద్​ నగరంలోని సోమాజీగూడ, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, బేగంపేట్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, హయత్ నగర్​లోనూ ఉదయం నుంచే వరుణుడు విరుచుకుపడ్డాడు. ఫలితంగా రోడ్లన్ని జలమయమై ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు.

ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీచూడండి: కరోనా భయం: జేసీబీతో యువకుడి మృతదేహం ఖననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.