ETV Bharat / state

బొగ్గు గనుల విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం

author img

By

Published : Feb 16, 2023, 7:37 PM IST

Public Opinion Program in Mancherial District: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో రెండు గనుల విస్తరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. పర్యావరణ పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అందరి నుంచి వివరాలు సేకరించిన అధికారులు.. త్వరలో నివేదికను కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

Environmental Public Opinion Program
పర్యావరణ ప్రజాభిప్రాయ కార్యక్రమం

Public Opinion Program in Manchiryala District: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని శాంతి స్టేడియంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ కార్యక్రమం జరిగింది. 1974లో 306 హెక్టార్ల భూమిలో ఆర్​కే 6 గని, అదే సంవత్సరంలో ఆర్​కే 5 భూగర్బ గనినీ సింగరేణి ప్రారంభించింది. ఈ రెండు మైన్లు అటవీ భూ పరిధిలోనే ఏర్పాటు చేశారు.

గని రివైజ్డ్‌ ప్లాన్‌ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదించిన బొగ్గు గని ప్లానింగ్‌లో 2022 వరకు మాత్రమే 1.18 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. దీంతో గని విస్తరణకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పర్యావరణ అనుమతులు వస్తే ఆరో గని జీవిత కాలం మరో మూడు సంవత్సరాలు, ఆర్కే ఐదో గని ఏడేళ్లు పెరిగే అవకాశం ఉంది.

దీనిని దృష్టిలో పెట్టుకుని గని విస్తరణకు అనుమతులు ఇవ్వాలని సింగరేణి సంస్థ కేంద్ర, రాష్ట్ర పర్యావరణ శాఖలకు దరఖాస్తు చేసుకుంది. దీంతో జిల్లా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వ్యక్తులు, అధికారులు, కార్మిక సంఘాల నుంచి అదనపు కలెక్టర్‌ అభిప్రాయాలను సేకరించి గని అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికను ఇవ్వనున్నట్లు తెలిపారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితో పాటు ప్రభావిత గ్రామాల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాల్సిన అవసరముందని సూచించారు.

గని విస్తరణ సమయంలో పర్యావరణానికి హాని కలగకుండా సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచించారు. బొగ్గు ఉత్పత్తి సమయంలో దుమ్ము, ధూళి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభావిత గ్రామాల్లో చెరువులపై చెక్ డ్యాం, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రింకింగ్ వాటర్ సిస్టం, స్థానికత ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

"బొగ్గు గనుల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించాం. గని 6లో సామర్థ్యం కంటే ఎక్కువ ఉత్పత్తి చేసి నియమ నిబంధనలు ఉల్లంఘించామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించింది. ఇందువల్ల ప్రభావిత ప్రాంతాల దగ్గర నుంచి ప్రజాభిప్రాయలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం." - మధుసూదన్ నాయక్ , అదనపు కలెక్టర్ మంచిర్యాల జిల్లా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.