ETV Bharat / state

జీతం చిన్నది... మనసు గొప్పది...

author img

By

Published : Aug 12, 2020, 8:37 AM IST

Junior Panchayat Secretaries help to many people in manchiryala district
Junior Panchayat Secretaries help to many people in manchiryala district

వారంతా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు.. ఇటీవలే ఉద్యోగాల్లో చేరారు.. ఒకరికొకరు పెద్దగా పరిచయం లేదు.. అంతంతమాత్రమే వేతనం.. మరికొందరికి అది కూడా రావడం లేదు. అయినా వారు స్పందించిన తీరు అభినందనీయం. తమతో పాటు ఉద్యోగం చేస్తూ మృతి చెందిన తోటి ఉద్యోగుల కుటుంబానికి అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు చేయిచేయి కలిపి లక్షలాది రూపాయలు సేకరించి వారికి అందజేశారు.. కష్టకాలంలో తోడుగా నిలిచారు.

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన గాండ్ల శ్రీనివాస్‌ పాతబెల్లంపల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా రెండు నెలల కిందట విధుల్లో చేరారు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి రామక్క అన్నీ తానై ఇద్దరు కూతుళ్లతో పాటు శ్రీనివాస్‌ను పెంచి పెద్ద చేసింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన శ్రీనివాస్‌ చిన్నతనం నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ ఆర్థికంగా అండగా నిలిచారు. రెండు నెలల కిందట జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో ఇక తమ కష్టాలు తీరిపోతాయని ఆనందపడ్డారు. వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఒక్క నెల వేతనం కూడా తీసుకోకుండానే అనారోగ్యంతో జులై 31న మృతి చెందారు.

మూడు రోజుల్లోనే రూ.3 లక్షలకుపైగా

శ్రీనివాస్‌ కుటుంబ దయనీయస్థితిని చూసి చలించిపోయిన తోటి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు వారికి ఏదైనా సహాయం చేయాలని భావించారు. అప్పటికే ఉన్న వాట్సాప్‌ గ్రూపులో 256 మంది సభ్యులుగా ఉన్నారు. గతంలో పాతబెల్లంపల్లి పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేసిన ప్రసాద్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శ్రీనివాస్‌ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ వివరాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన తోటి ఉద్యోగులు కేవలం మూడు రోజుల వ్యవధిలో రూ.1.40 లక్షలు సమకూర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్న టెలిగ్రామ్‌ గ్రూపు సభ్యులు కూడా స్పందించారు. వారంతా కలిసి రూ.2.40 లక్షలు సేకరించారు. మొత్తం రూ.3.80 లక్షల విలువైన చెక్కును డీపీవో వీర బుచ్చయ్య చేతుల మీదుగా ఇటీవల అందజేశారు.

  • ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి బూడిద వెంకటనర్సు కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. నూతనంగా విధుల్లో చేరిన వీరికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందే అవకాశం లేకపోవడంతో జిల్లా కార్యదర్శులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కలిసి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం చేసి చిరుద్యోగుల పెద్ద మనసును చాటారు.
  • నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని వెల్మల్‌ గ్రామానికి చెందిన సగ్గం శ్రీకాంత్‌ (34) పేదరికం ఉండి కష్టపడి చదివి ఏడాదిన్నర క్రితం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరారు. దత్తాపూర్‌లో కార్యదర్శిగా పని చేస్తూ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో జూన్‌16న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో గర్భిణిగా ఉన్న ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు పెద్ద దిక్కును కోల్పోయారు. ఈ విషయం తెలుసుకొన్న తోటి ఉద్యోగులు సుమారు రూ.3 లక్షలు ఆర్థికసాయం చేశారు.
  • సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలానికి చెందిన పల్లె మల్లేశంది నిరుపేద కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి మునిపల్లి మండలం గార్లపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మల్లేశం ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని తెలుసుకున్న తోటి ఉద్యోగులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల సాయంతో రూ.4 లక్షలు ఆర్థికసాయం చేశారు. ఇందులో రూ.3 లక్షలు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నుంచే ఇచ్చారు.
  • యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్న ఉదయ్‌కుమార్‌.. ఈనెల 7న విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకు రూ.4 లక్షలు అవుతుందని వైద్యులు పేర్కొనడంతో.. తండ్రి లేక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఉదయ్‌ను కాపాడుకోవడానికి ఆ జిల్లా కార్యదర్శులు విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష రూపాయలకు పైగా వచ్చినట్లు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.