ETV Bharat / state

గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాలకి చేరుకోలేక విద్యార్థుల ఇక్కట్లు

author img

By

Published : Nov 1, 2020, 4:34 PM IST

pupils faced problems to reach guruka exam centres in mahabubnagar
గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాలకి చేరుకోలేక విద్యార్థుల ఇక్కట్లు

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. మహబూబ్​నగర్​ జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థుల హాల్​టికెట్లలో పరీక్షా కేంద్రం చిరునామా స్పష్టంగా లేకపోవడంతో 50 శాతానికి పైగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొందరు సమయానికి చేరుకోకపోవడంతో పరీక్షలు రాయలేకపోయారు.

గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు.. చిరునామా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాల్​టికెట్లలో చిరునామా స్పష్టంగా లేకపోవడంతో పరీక్షా కేంద్రానికి చాలామంది విద్యార్థులు సరైన సమయానికి చేరుకోలేక పోయారు.

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంటలోని బీసీ గురుకుల బాలుర పాఠశాలను వసతి సౌకర్యాల లేమితో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్రలో నిర్వహిస్తున్నారు. దేవరకద్రలోని ఎస్సీ గురుకుల పాఠశాలను.. వసతి లేదని జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్​లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​ని జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పోచమ్మ గడ్డ తండాలో నిర్వహిస్తున్నారు.

గురుకుల పాఠశాలలు మంజూరైన మండలాల్లో వసతుల లేమి పేరిట ఇతర మండలాల్లో నిర్వహించడంతో ఆయా పాఠశాలల గుర్తింపు మంజూరైన మండలం పేరిట ఉండడం, పాఠశాల నిర్వహణ మాత్రం ఇతర మండలాల్లో ఉండటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది సమయానికి వెళ్లకపోవడంతో పరీక్ష రాయకుండానే ఇంటిముఖం పట్టారు.

ఇకనైనా ప్రవేశ పరీక్షా కేంద్రాల చిరునామాలు స్పష్టంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్​ షో"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.