ETV Bharat / state

పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్​ షో"

author img

By

Published : Nov 1, 2020, 2:15 PM IST

అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊళ్లోకి అడుగుపెట్టిన వారికి వినిపించే పదాలు. టేక్‌.. కట్‌.. యాక్షన్‌. పల్లెలో వినిపించాల్సింది పక్షుల కూతలు.. పశువుల అరుపులు... పిల్లల కేరింతలు.. పెద్దల ముచ్చట్లు కదా అనుకుంటున్నారా... వాటినే దృశ్యరూపంలో చిత్రీకరించి లఘుచిత్రాలుగా అందిస్తున్నారు మై విలేజ్​షో నిర్వాహకులు. సినిమాను తలపించేలా లఘుచిత్రాలు నిర్మిస్తూ యూట్యూబ్​ వేదికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగిత్యాల జిల్లా లంబాడి పల్లెకు చెందిన మై విలేజ్​ షో బృందం.

పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్​ షో"
పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్​ షో"

సామాజికి అంశాలే వారి కథాంశం... నటనలో సహజత్వమే వారి ప్రధాన బలం.. ఆకట్టుకునే యాసే అదనపు హంగు.. అన్నీ కలిసి పల్లె వాతావరణాన్ని... సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు జగిత్యాల జిల్లా లంబాడి పల్లెలోని మై విలేజ్​షో బృందం. ఏదో చిత్రం చూస్తున్నట్లుగా కాకుండా.. పక్క మనిషితో మాట్లాడుతున్నామన్న అనుభూతితో సాగిపోయేలా లఘుచిత్రాలు అందిస్తోన్న మై విలేజ్​షో యూట్యూబ్​లో ఛానల్​కి చాలా మంది అభిమానులున్నారు.

పక్కా లోకల్​...

గ్రామానికి చెందిన కొందరు యువకులు బృందంగా ఏర్పడి... వారు చూసిన, అనుభవించిన... చదువుకున్న... తెలుసుకున్న అంశాలనే కథాంశంగా ఎన్నో లఘు చిత్రాలు రూపొందించారు. మై విలేజ్​షో పేరుతో యూట్యూబ్​ ఛానల్​ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఊళ్లోనే లఘుచిత్రాలు నిర్మిస్తూ ఉపాధి పొందుతున్నారు.

గంగవ్వ అండగా ఉండగా..

తనదైన యాసతో... తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని గంగవ్వ వీరి బృందానికి అదనపు బలం. నిరక్షరాస్యురాలైన గంగవ్వను వెలుగులోకి తెచ్చింది 'మై విలేజ్​షో'నే. లఘుచిత్రాల స్థాయి నుంచి వెండితెర వరకు బాటలు వేసింది ఈ యూట్యూబ్​ ఛానల్​.

200పైగా లఘు చిత్రాలు

2013లో మై విలేజ్​షో పేరుతో ప్రారంభమైన వీరి లఘుచిత్రాల రూపకల్పన సుమారు 200 పైగా చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. వాటిలో ప్రధానంగా మరుగుదొడ్డి కట్టు మల్లన్న, తూట్ల పాయింట్‌, దెయ్యం బడితే, పిసినారి రాజు ఇలా ప్రక్షకులను అలరించినవి.. ఆలోచింపజేసేవి ఎన్నో ఉన్నాయి. వీరి బృందంలో పదిమంది ఉండగా... చిత్రాలకు దర్శకుడిగా శ్రీకాంత్​ పనిచేస్తున్నాడు.

ఊళ్లోనే ఉపాధి..

గ్రామంలో ఓ గదిలో స్టూడియో ఏర్పాటు చేసుకుని అక్కడే ఎడిటింగ్‌, డబ్బింగ్‌, ఇతర పోస్ట్‌ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్టూడియోలోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారి కోసం పలు పుస్తకాలు అందుబాటులో ఉంచారు. లఘు చిత్రాల రూపకల్పనతో వచ్చిన ఆదాయంతో గ్రామంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్రీకరణ లేని సమయంలో వ్యవసాయ పనులు చేసుకుంటారు.

పల్లె వాతావరణమే ప్రధాన వనరు

వీరి చిత్రాలు సహజత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. పల్లె వాతావరణం, ఆకట్టుకునే మాటతీరు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. యూట్యూబ్​లో వీరి ఛానల్​కు లక్షకు పైగా సబ్​స్క్రైబర్​లను సాధించిపెట్టింది. ప్రేక్షకులు అందిస్తున్న భరోసాతో.. భవిష్యత్​లో మరిన్ని లఘుచిత్రాలు అందిస్తామని చెబుతున్నారు మై విలేజ్​షో బృంద సభ్యులు.

ఇదీ చూడండి: ఆ స్టార్టప్​లతో.. ఏ పరీక్షకైనా ఇంట్లోనే చదువుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.