ETV Bharat / state

అచ్చంపేటలో ఎమ్మెల్యే వర్సెస్​ ఎంపీ.. జిల్లాలో ఇప్పుడిదే హాట్​టాపిక్

author img

By

Published : Mar 6, 2023, 12:32 PM IST

Clash Between Guvvala Balaraju and MP Ramulu
Clash Between Guvvala Balaraju and MP Ramulu

Clash Between Guvvala Balaraju and MP Ramulu: నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్​ఎస్​లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఎంపీ రాములు, అతని కుమారుడు భరత్ ప్రసాద్‌కు సంబంధించిన బ్యానర్లను తొలగించాలంటూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు రాములును హెచ్చరించిన ఆడియో ఒకటి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

గువ్వల బాలరాజు, రాములు మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు.. ఆడియో వైరల్

Phone Conversations Between Guvvala Balaraju and MP Ramulu: అచ్చంపేట శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు-ఎంపీ రాములుకు మధ్య జరిగిన సెల్‌ఫోన్ సంభాషణలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాములు, అతని కుమారుడు భరత్ ప్రసాద్‌కు సంబంధించిన బ్యానర్లను తొలగించాలని గువ్వల బాలరాజు.. ఎంపీ రాములును హెచ్చరించారు. ఆ ఆడియో ఒకటి అచ్చంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

అధికార పార్టీలోనే ఉన్నా విభేదాలు కొనసాగుతున్నాయి: కాబోయే ఎంపీ, కాబోయే ఎమెల్యే అంటూ నియోజకవర్గంలో పలు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. భరత్‌కు సంబంధించి అలాంటి బ్యానర్లు కనిపించవద్దని, లేదంటే పార్టీ కన్నా ముందు తనకున్న అధికారాలను వినియోగిస్తానని బాలరాజు చెప్పడం, ఈ వ్యవహరాన్ని పార్టీ దగ్గరే తేల్చుకుంటానని రాములు దానికి బదులివ్వడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. చాలా కాలంగా గువ్వల బాలరాజు-ఎంపీ రాములు వర్గాలకు మధ్య అచ్చంపేట నియోజకవర్గంలో విబేధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

వైరల్‌గా మారిన ఫోన్ సంభాషణలు: నాగర్ కర్నూల్ జడ్పీ ఛైర్మన్ పదవిని రాములు కుమారుడు భరత్ ప్రసాద్ రెండుసార్లు ఆశించి భంగపడ్డారు. మొదట్లో అవకాశం చేజారినా.. ఇటీవల జరిగిన జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లోనైనా తనకు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ అధిష్ఠానం మరొకరికి ఆ పదవి కట్టబెట్టడంతో రాములు సహా భరత్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి బాలరాజు సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. గువ్వల అభిమానులు వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల వివాదం ముదరడంతో బాలరాజు నేరుగా రాములుకు ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివాదం ఇలా మొదలైంది..: గతంలో జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక పార్టీలో భేదాభిప్రాయాలకు దారి తీసింది. ఛైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ కల్వకుర్తి జడ్పీటీసీ, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్ తన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి గానూ.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి, వారిని ఎదగనివ్వకుండా అడ్డుకునేందుకు సొంత పార్టీలో వ్యక్తులే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్​ఎస్​ను జాతీయ పార్టీగా ఎదిగేలా చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే, అచ్చంపేటలో కొందరు నేతలు మాత్రం పార్టీని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం 20 జడ్పీటీసీ స్థానాల్లో 19 స్థానాలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉండగా.. ఊర్కొండ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో కచ్చితంగా ఛైర్మన్ పదవి కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్న భరత్‌కే దక్కుతుందని అంతా భావించారు. కానీ అధిష్ఠానం నుంచి పంపిన సీల్డ్ కవర్​లో ఊర్కొండ జడ్పీటీసీ శాంతకుమారి పేరు ఉండటంతో భరత్ ప్రసాద్, ఎంపీ రాములు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.