ETV Bharat / state

బెంబేలెత్తిస్తోన్న వంటనూనె ధరలు... చితికిపోతున్న సామాన్యుడు

author img

By

Published : Mar 28, 2021, 8:35 PM IST

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు చెబితే బెంబేలెత్తిపోతున్న సామాన్యులు... ప్రస్తుతం వంట నూనెల ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చినా, గత నెల ధరలతో పోల్చినా వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. పల్లి, పొద్దు తిరుగుడు, చివరకు పామాయిల్ ధరలు సైతం మండిపోతున్నాయి. పెరిగిన వంట నూనెల ధరలు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు చిరువ్యాపారులపై తీవ్రప్రభావం చూపుతోంది.

Oil prices
వంటనూనె ధరలు

బెంబేలెత్తిస్తోన్న వంటనూనె ధరలు

పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతోంది. వంటగ్యాస్ ధరలు మండుతున్నాయి. దీనికితోడు వంటనూనెల ధరలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడం నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది.

సగటు ధరలు...

ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాల్లో వేరుశనగ నూనె ధర లీటరుకు రూ. 150 ఉంటే ప్రస్తుతం రూ. 160కి చేరింది. గత నెల రూ. 136 ఉన్న పొద్దుతిరుగుడు నూనె ప్రస్తుతం రూ. 147కు చేరింది. పామాయిల్ సైతం నెల రోజుల్లో రూ. 110 నుంచి రూ. 116కు పెరిగింది. ఇవే నూనెల ధరల్ని గత ఏడాదితో పోల్చితే పల్లి రూ. 35, పొద్దుతిరుగుడు రూ. 50, పామాయిల్ రూ. 35కు పెరిగింది.

జిల్లా వారీగా పెరిగిన రేట్లు వేరుగా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో బహిరంగ మార్కెట్​లో కిలో పల్లినూనె రూ. 158, పొద్దు తిరుగుడు రూ. 160, పామాయిల్ రూ. 124గా ఉంది. దీంతో సామాన్యుని నెలవారీ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి.

పెరిగిన ధరలతో నష్టాలు...

ఖర్చు పెరగడం వల్ల నెలకు 5 లీటర్లు వాడేవాళ్లు 3 లీటర్లతో సరిపెట్టుకుంటున్నారు. వ్యాపారులకు గిరాకీ తగ్గుతోంది. నూనె ఆధారిత ఆహార ఉత్పత్తులు తయారు చేసే చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా కారణంగా టిఫిన్లు, రెస్టారెంట్లు, హోటళ్లకు కాస్త గిరాకీ తగ్గింది. మరోవైపు ధరలు పెరిగాయి. వ్యాపారంలో లాభాలు లేవని వాపోతున్నారు.

వాటి ధరలు కూడా అధికమే...

గత ఏడాదితో పోల్చితే పప్పుల ధరలు సైతం అధికంగానే ఉన్నాయి. వీటితో పాటు పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సైతం సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కరోనా కారణంగా ఓవైపు ఆదాయం లేక ఖర్చులు పెరిగి సామాన్యుడు చితికిపోతున్నాడు. దీనికి తోడు ప్రస్తుతం సెకండ్ వేవ్ సైతం ఆందోళనకు గురి చేస్తోంది.

పెరిగిన డిమాండ్...

దేశంలో వేరుశనగ ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో మనదేశ వేరుశనగకు డిమాండ్ పెరగడం వల్ల ఈసారి వేరుశనగ మంచి రేటు పలికింది. ఇదే నూనెల ధరలపైనా ప్రభావం చూపింది. డిమాండ్​కు తగిన ఉత్పత్తి లేకపోవడం వల్ల పల్లినూనెల ధరలు పెరిగాయి. పొద్దుతిరుగుడు, పామాయిల్, సోయానూనెల కోసం విదేశీ దిగుమతులపైనే ఆధారపడ్డాం.

నూనె ధరలకు రెక్కలు..

కరోనా కారణంగా విదేశాల్లో ఉత్పత్తి తగ్గడం, దిగుమతులూ పడిపోవడంతో నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం కనిపిస్తుండటం వల్ల మరో రెండు నెలల పాటు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నూనెల ధరలు సాధారణ స్థితికి చేరుకోవడం భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

గత నెలతో పోల్చితే బియ్యం, చింతపండు, ఉల్లిగడ్డ, పచ్చి మిరప, ఆలు, వంకాయ, బెండకాయ లాంటి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యునికి కాస్త ఊరటనిచ్చాయి.

ఇవీచూడండి: లాభసాటి పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.