ETV Bharat / state

చేనేత కార్మికుల పాలిట పెనుశాపంగా విద్యుత్ బిల్లులు.. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి

author img

By

Published : Feb 15, 2023, 10:37 PM IST

Hamdloom Industry, Gadwal Saree,
Handloom Workers Problems

Handloom Workers Problem in Mahabubnagar : ఆధునిక కాలంలో కొత్తగా పుట్టుకొస్తున్న అనేక సాంకేతిక సంస్థల కారణంగా దేశంలో అనేక వృత్తులు అంత‌రించిపోతున్నాయి. ఇంట‌ర్నెట్‌, యంత్రాల వాడ‌కం వ‌ల్ల ఎన్నో చేతి వృత్తులు క‌నుమ‌రుగైన పరిస్థితి. కానీ చేనేత రంగం నేటికీ త‌న ఉనికిని చాటుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని చేనేత కార్మికులను కొన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ బిల్లుల రూపంలో వారిని కష్టాల పాలు చేస్తున్నాయి. దీనిపై రాయితీ క‌ల్పించాల‌ని వేడుకుంటున్నారు.

Handloom Workers Problem in Mahabubnagar : రోజురోజుకీ పెరుగుతున్న అధునాత‌న సాంకేతికత మ‌నుషుల‌కు అనేక ర‌కాలుగా మేలు చేస్తోంది. దీన్ని ఉప‌యోగించి మాన‌వులు కొన్ని ప‌నులను సుల‌భంగా చేయ‌గ‌లుగుతున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక‌వైపే. అదే టెక్నాల‌జీ కారణంగా కొంద‌రు త‌మ ఉనికిని కోల్పోయే స్థితిలో ఉన్నారు. దేశంలో అనేక ర‌కాల కుల వృత్తులు చేసుకుని జీవించే వాళ్లున్నారు. ఇలాంటి వారిపై సాంకేతిక టెక్నాల‌జీ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది.

దిన‌దినాభివృద్ధి చెందుతోన్న టెక్నాల‌జీతో క‌నిపెట్టిన యంత్రాల వ‌ల్ల త‌మ‌కు ప‌ని లేకుండా పోయిందని చేతివృత్తుల వారు వాపోతున్నారు. ఫ‌లితంగా త‌మ జీవ‌నం ప్ర‌శ్నార్థ‌కంగా మారిందంటున్నారు. ఈ సాంకేతికత అనే కాల‌గ‌ర్భంలో అనేక రంగాలు క‌లిసిపోయిన‌ప్ప‌టికీ కొన్ని వాటి ఉనికికి నేటికీ చాటుతున్నాయి. అందులో చేనేత రంగం కూడా ఒక‌టి. మ‌న తెలంగాణ‌లో ఈ రంగానికి చెందిన వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, న‌ల్గొండ‌, క‌రీంన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో వీరి శాతం అధికం. అయితే వీరిని క‌ష్టాలు వెంటాడుతున్నాయి. అస‌లే అంతంత మాత్రంగా వస్తున్న డబ్బుతో బ‌తుకీడుస్తున్న వారికి విద్యుత్ బిల్లులు భారం అధికమవుతుంది. బిల్లుల విషయంలో రాయితీలు ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ‌ట్ల‌యింది: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గద్వాల పట్టు చీరలు తయారు చేసే చేనేత కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్ప‌టికే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వారిపై విద్యుత్ బిల్లుల భారంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ‌ట్ల‌యింది. నేసిన చీరకు గిట్టుబాటు ధర రాక, మాస్టర్ వీవర్స్ ఇచ్చే కూలీ సరిపోక, మగ్గం నేయ‌డానికి ఉపయోగించే కరెంటు బిల్లులు కట్టుకోలేక వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించేందుకు గాను నాయి బ్రాహ్మణులకు, రజకులకు నెల‌కు 250 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్ రాయితీ ఇస్తుంది. వారిని ప్రోత్స‌హించిన‌ట్టుగానే త‌మ‌కు సాయం చేయాల‌ని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్​న‌గ‌ర్ జిల్లాకు చెంద‌ని చేనేత కుటుంబాలు ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నాయి.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో మొత్తం 3458 జియో ట్యాగ్ మగ్గాలు ఉన్నాయి. ఇందులో జోగులాంబ గద్వాలలో 2140, నారాయణపేటలో 662, వనపర్తిలో 340, మహబూబ్ నగర్ జిల్లాలో 371, నాగర్ కర్నూల్​లో 15 ఉన్నాయి. వీటిపై ఆధారపడి దాదాపుగా 8 వేల వరకు చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయి. వివిధ రకాల డిజైనర్లతో పట్టు, సీకో కాటన్ చీరలు తయారు చేస్తూ జీవనం గడుపుతున్నాయి. సూక్ష్మంగా ఉండే పట్టు దారంతో కార్మికులు ఇంట్లో మగ్గం చీరలు నేసేటప్పుడు రోజంతా విద్యుత్ వెలుగులో పని చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యుత్ వాడ‌కం పెరిగి.. నెల‌ల వారీ బిల్లులు అధిక‌మ‌తున్నాయి.

మాకు రాయితీలు కల్పించాలి : ఒక మగ్గం ఉన్న ఒక్కో ఇంటికి సుమారు రూ.400 నుంచి రూ.1000 వ‌ర‌కు బిల్లు వస్తుంద‌ని వారు చెబుతున్నారు. ఒక్క చీర తయారీ కోసం వారం రోజులు కష్టపడాల్సి ఉంటుంది. దీంతో ఆదాయం త‌క్క‌వ‌గానే ఉంటుంది. కానీ చీర త‌యారీకి అయ్యే ఖ‌ర్చు అధికమవుతోంది. చేసేది లేక బిల్లుల భారం త‌గ్గించుకోవ‌డానికి చిన్నగా ఉన్న ఇల్లును రెండు మూడు మీటర్లు అమర్చుకుంటున్నారు. రాజోలి ఐజ, గద్వాల, కొత్తకోట తదితర ప్రాంతాల్లో ఈ తరహా పరిస్థితి ఉంది. కుటుంబమంతా కష్టపడి సంపాదించిన దాంతో ఇంట్లో ఖర్చులు, పిల్లల చదువులతో పాటు విద్యుత్ బిల్లులకే ఎక్కువ భాగం ఖర్చు అవుతుండటంతో ఏమీ మిగలడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు, రజకులకు ఇచ్చిన మాదిరిగానే త‌మ‌కూ... రాయితీ క‌ల్పించి ఆదుకోవాల‌ని కార్మికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.