ETV Bharat / bharat

ప్రభుత్వ బడిలో అమితాబ్​ బచ్చన్​ టీచర్​.. 'కేబీసీ' షో తరహాలో విద్యార్థులకు పోటీ

author img

By

Published : Feb 15, 2023, 9:27 PM IST

KBIC Show In Govt. School
ప్రభుత్వ పాఠశాలలో కేబీఐసీ ప్రోగ్రాం

సాధారణంగా చాలా మంది పిల్లలకు ఆటపాటలపై ఉండే ఆసక్తి చదువుపై ఉండదు. విద్యార్థుల జీవితాలు మెరుగుపడాలంటే ఆటలతో పాటుగా చదువు కూడా ఎంతో ముఖ్యం. అయితే వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి చదువుపై ఆసక్తి పెంచేందుకు ఓ టీచర్​ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు.

ప్రభుత్వ బడిలో అమితాబ్​ బచ్చన్​ టీచర్​.. 'కేబీసీ' షో తరహాలో విద్యార్థులకు పోటీ

విద్యార్థుల కోసం విభిన్నంగా ఆలోచించారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రముఖ టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్​పతి' తరహాలో.. స్కూల్లో ' కౌన్​ బనేగా ఇంటెలిజెంట్​ చైల్డ్​' పేరుతో ఓ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. ఆయనే ఉత్తర్ ప్రదేశ్​ మిర్జాపుర్​కు చెందిన సత్యేంద్ర కుమార్​ సింగ్​.

ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో చదువుపై ఇష్టాన్ని పెంచుతున్నారు సత్యేంద్ర కుమార్. పిల్లల్లో లోకజ్ఞానం పెరిగే విధంగా కృషి చేస్తున్నారు. ప్రతి శనివారం భోజన విరామం సమయంలో ఈ ప్రత్యేక షోను నిర్వహిస్తారు సత్యేంద్ర. గెలిచిన వారికి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను సైతం అందజేస్తారు.

KBIC Show In UP Govt. School
గెలిచిన విద్యార్థికి ప్రశంసా పత్రం అందిజేస్తున్న పాఠశాల సిబ్బంది

"మా విద్యార్థులు ఏడో తరగతి చదువుతున్నారు. అనకూడదు కానీ, చెప్పాల్సి వస్తుంది. వీరు కాస్త నిమ్న వర్గాల నుంచి వచ్చినవారు. వీరు చదువు పట్ల అంతగా ఆసక్తి కనబరచరు. అయితే వీరికి చదువుపై ఇష్టాన్ని కలిగించేందుకు మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలో చెప్పే పాఠాలతో పాటు.. కాస్త మనోవికాసాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలు ఇష్టంగా చదువుతారు. ఇందుకోసమే నేను ప్రత్యేకంగా కేబీఐసీ (కౌన్​ బనేగా ఇంటెలిజెంట్ చైల్డ్​) గేమ్​ను రూపొందించాను. దీనిని ప్రతి శనివారం భోజన విరామం అనంతరం నిర్వహిస్తాను. ఈ ఆట ఆడటానికి పిల్లలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పిల్లలు చాలా లాభపడుతున్నారు. కొందరి పిల్లల మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల చదువులో రాణించలేకపోయేవారు. ఇక ప్రస్తుతం దీనిని ఆడించడం ద్వారా వారి ఆలోచనా శక్తి పెరుగుతోంది. దీంతో చదువుల్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. మొత్తంగా పాఠశాల రిజల్ట్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి."

--సత్యేంద్ర కుమార్​ సింగ్, ఉపాధ్యాయుడు.

'కౌన్ బనేగా కరోడ్​పతి' షో తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సత్యేంద్ర కుమార్​. ముందుగా విద్యార్థులకు ఫాస్టెస్ట్​ ఫింగర్​ ఫస్ట్​లో ఓ ప్రశ్నను అడుగుతారు. అందులో సరైన సమాధానం చెప్పిన విద్యార్థిని హాట్ సీట్​పై కూర్చోబెడతారు. అనంతరం పది ప్రశ్నలను అడుగుతారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు.. అడిగిన ప్రశ్నల ఆధారంగా గుడ్​, బెటర్​, బెస్ట్​, ఇంటెలిజెంట్​ చైల్డ్​ పేర్లతో సర్టిఫికెట్లు అందజేస్తారు. పాఠశాల యాజమాన్యం కూడా ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహిస్తోంది.

KBIC Show In UP Govt. School
కేబీఐసీలో విద్యార్థిని ప్రశ్నలు అడుగుతున్న సత్యేంద్ర కుమార్​ సింగ్​

"మా సర్​ ఈ కేబీఐసీ ద్వారా మాకు చదువుపై ఇష్టాన్ని పెంచుతున్నారు. టీవీలో వచ్చే కౌన్​ బనేగా కరోడ్​పతిలో మాదిరిగానే ఇక్కడ ఆడిస్తున్నారు. మాకు ఎంత బాగా అనిపిస్తోందో మాటల్లో చెప్పలేను. మేము ప్రతి వారం శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము. అంతే కాకుండా హాట్​ సీట్​పై కూర్చోవడానికి ఆశ పడుతుంటాము. దీంతో మాకు చదువు పట్ల ఆసక్తి పెరగటమే కాకుండా.. జనరల్​ నాలెడ్జ్​ కూడా పెరుగుతోంది."

- సకీనా బానో, విద్యార్థిని

ఉపాధ్యాయుడు సత్యేంద్ర కుమార్​కు చేసే ఈ కార్యక్రమంతో.. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తున్నారని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. పాఠశాలకు కూడా మంచి పేరు వస్తోందని హర్షం వ్యక్తం చేస్తోంది. విద్యార్థుల తల్లితండ్రులు కూడా సత్యేంద్ర కుమార్ చేసే క్విజ్​ కార్యక్రమాలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువుల్లో మంచి మార్పు వచ్చిందని చెబుతున్నారు.

KBIC Show In UP Govt. School
కేబీఐసీలో విద్యార్థిని ప్రశ్నలు అడుగుతున్న సత్యేంద్ర కుమార్​ సింగ్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.