ETV Bharat / state

కరోనా వేళ.. పెద్దపులి హడలెత్తిస్తోంది!

author img

By

Published : May 8, 2020, 9:19 AM IST

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అడవుల్లో ప్రశాంతత నెలకొంది. మనుషుల సంచారం లేకపోవడంతో పక్షులు, వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యాల నుంచి వచ్చిన పులి దాదాపు ఇరవై రోజుల నుంచి ఆసిఫాబాద్‌ మండల పరిసరాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాగునీటి వనరుల వెంబడి ముందుకు సాగుతూ సమీప గ్రామాల పశువులను సంహరిస్తోంది. అప్పుడప్పుడు మనుషులకు కనిపిస్తూ భయాందోళన కలిగిస్తోంది.

tiger wandering in kumarambheem asifabad district
హడలెత్తిస్తున్న.. పెద్దపులి

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి ఈ పులి వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. తడోబా నుంచి రాజురా అడవుల మీదుగా, కాగజ్‌నగర్‌ కారిడార్‌కు వచ్చిందని, ఇక్కడి నుంచి నీటి వనరులను వెతుక్కుంటూ పెదవాగు వెంబడి ఆసిఫాబాద్‌ వైపు వస్తుందని పాదముద్రల ఆధారంగా అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట, గోలేటి సమీపంలో, చీలేటిగూడ శివారు ప్రాంతంలో పశువులు పులి దాడిలో చనిపోయాయి.

కైరిగూర ఉపరితల గని వద్ద

ఆసిఫాబాద్‌కు సరిహద్దుగా ఉన్న వట్టివాగు జలాశయానికి ప్రధానంగా నీటిని తీసుకువచ్చే వాగు వద్ద గురువారం పులి, సమీప కైరిగూర ఉపరితల గనిలో పని చేసే కార్మికులకు కనిపించింది. దీంతో ఈ ఉపరితల గనిలో పని చేసే కార్మికుల్లో ఆందోళన నెలకొంది. వాగుపై ఉన్న వంతెన మీదుగా తిర్యాణి మండల కేంద్రానికి, సమీపంలో ఉన్న వివిధ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కైరిగూర ఉపరితల గనిలో 540 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. విడతల వారీగా విధులు నిర్వహించే వీరిలో రాత్రి సమయంలో విధులు ముగించుకుని సమీప గ్రామాలకు వెళ్లే వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కైరిగూర ఉపరితల గని దగ్గరే ఉల్లిపిట్ట, జెండగూడ, వట్టివాగు కాలనీ, గోవర్‌గూడ గ్రామాలు ఉన్నాయి. వీరు సైతం బయటకు రావడానికి జంకుతున్నారు.

సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం

పులి వచ్చిన దారి, వెళుతున్న మార్గం, సంచరిస్తున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. నాలుగు రేంజ్‌ల పరిధిలో అధికారులందరూ పులి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ట్రాకర్లు, బేస్‌క్యాంప్‌ సిబ్బంది పులి కదలికలపై నిఘా ఉంచారు.

- గులాబ్‌ సింగ్‌, ఎఫ్‌ఆర్‌ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.